తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 392

వికీసోర్స్ నుండి


రేకు: 9004-01 ఆహిరి సం: 04-532 ఇతర దేవతలు

పల్లవి:

తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూఁగెఁగన
చెల్లుబడినూఁగీని శ్రీరంగశిశువు

చ. 1:

కలికి కావేరి తరగల బాహులతలనే
తలఁగకిటు రంగమధ్యపు తొట్టెల
పలుమారుఁదనునూఁచి పాడఁగానూఁగీని
చిలుపాల సెలవితో శ్రీ రంగ శిశువు

చ. 2:

అదివొ కమలజుని తిరువారాధనంబనఁగ
అదనఁ గమలభవాండమనుతొట్టెల
ఉదధులు తరంగములనూఁచఁగా మాఁగీని
చెదరని సిరులతోడ శ్రీ రంగశిశువు

చ. 3:

వేదములె చేరులై వెలయంగ శేషుఁడే
పాదుకొను తొట్టెలై పరగఁగాను
శ్రీ దేవితోఁగూడి శ్రీ వేంకటేశుఁడై
సేద దేరెడి వాఁడె శ్రీ రంగశిశువు


రేకు: 9013-01 శ్రీరాగం సం: 04-533 నృసింహ

పల్లవి:

వెరపు దెలుపునీ వేగిరిమే నీ
వెఱిఁగియు నెఱఁగక యేమంటివో

చ. 1:

గోరపురుధిరము గురియు గోళ్ళ నీ
తోరమైన యా తొడమీఁద
గోరంటగోళ్ళ కోమలి నిలువఁగ
ఈరసమందక యేమంటివో

చ. 2:

నెత్తురుఁ బెదవుల నీ మొకమలరఁగ
బిత్తరి వీడెపుఁ బెదవులతో
మత్తకరిగమన మాటలాడఁగా
ఎత్తిన మదమున నేమంటినో

చ. 3:

ఆననరౌద్రము నట్టహాసమును
పూనిన నినుఁగని బొమముడితో
లేనగవుల నదలింపెడి సిరితో
హీనాధికముల నేమంటివో

చ. 4:

పెద పెద యూర్పుల పేగుల జందెపు
టుదరముతో నీవుండుచును
చెదరిన పయ్యెద చెరఁగు జారుసతి
యెదురెదురను నీవేమంటివో

చ. 5:

చింప నెరుల నీ శిరసు ముడుచుకొని
కంపముడిగి వేంకటపతివై
లంపటమందుచు లక్షీసతితో
ఇంపులు నెరపుచు నేమంటివో


రేకు: 9016-01 రామక్రియ సం: 04-534 అధ్యాత్మ

పల్లవి:

అందరి వసమా హరి నెరుఁగ
కందువగ నొకఁడుగాని యెరఁగఁడు

చ. 1:

లలితపు పది గోట్ల నొకఁడుగాని
కలుగఁడు శ్రీ హరిఁ గని మనఁగ
ఒలిసి తెలియు పుఖ్యుల కోట్లలో
ఇలనొకఁడుగాని యెరఁగడు హరిని

చ. 2:

శ్రుతి చదివిన భూసుర కోట్లలో
గతియును హరినె యొకానొకఁడు
అతి ఘనులట్టి మహాత్మ కోటిలో
తతి నొకఁడుగాని తలఁచఁడు హరిని

చ. 3:

తుది కెక్కిన నిత్యుల కోట్లలో
పొదుగు నొకడు తలపున హరిని
గుదిగొను హరి భక్తుల కోట్లలో
వెదకు నొకఁడు శ్రీ వేంకటపతిని


రేకు: 9016-02 ఆహిరి సం: 04-535 వైరాగ్య చింత

పల్లవి:

మాయల కగపడి మతిగెడి ప్రాణులు
రోయఁ దలఁచియును రోయఁగలేరు

చ. 1:

మిస మిస మెరువఁగ మెల్లన చేరిరి
ముసిఁడిమాని ఫలములు చూచి
రసమని సంసారపు బాలికులిదె
విసిరి చేఁదుగని విరుగఁగలేరు

చ. 2:

బలు విష మొలికెడి పాముఁ బట్టుకొని
అలరుచు నలుగడ నాడేరు
పొలసి యాసలూర్పులు నిగుడించఁగ
తెలిసియు నింకాఁ దెలియఁగలేరు

చ. 3:

తేనెదెచ్చి కత్తికి దారఁ బెట్టి (న)
నానా విధముల నాఁకేరు
దీన తలణఁపెడి తిరు వేంకటపతి
చేని పంటలకుఁ జెయి చాఁచలేదు


రేకు: 9016-03 బౌళి సం: 04-536 నామ సంకీర్తన

పల్లవి:

కందర్పజనక గరుడగమన
నందగోపాత్మజ నమో నమో

చ. 1:

వారిధి శయన వామన శ్రీధర
నారసింహ కృష్ణ నమో నమో
నీరజ నాభ నిగమ గోచర
నారాయణ హరి నమో నమో

చ. 2:

పరమ పురుషా భవ విమోచన
వరద వసుధావధూవర
కరుణా కాంతా కాళిందీ రమణ
నరసఖ శౌరీ నమో నమో

చ. 3:

దానవ దమన దామోదర శశి
భాను నయన బల భద్రానుజ
దీన రక్షక శ్రీ తిరు వేంకటేశ
నానా గుణమయ నమో నమో


రేకు: 9018-01 ఆహరి సం: 04-537 వైరాగ్య చింత

పల్లవి:

ఏమి దిరిగేమెందైనను ఊర
కోమితిమి దేహమోహోబదుకు

చ. 1:

బ్రహ్మ కల్పము దాఁక బ్రదికేమో, కాక
బ్రహ్మానందంబుఁ బడసేమా
బ్రహ్మ మీ దేహలంపట మనుచు పరం
బ్రహ్మంబు వదలితిమి బాపు బ్రదుకు

చ. 2:

ఒడిలితో నిట్టనే వుండేమా, కాక
చెడని పుణ్యములెల్లఁ జేసేమా
యెడయకమరపదం బేలేమా, వృథా
చెడిపోయె దినములిస్సీ బదుకా

చ. 3:

ఆపదలు లేని సుఖమందేమా, కాక
పాపంబు లేని మతిఁ బరగేమా
ఏపు మీరిని వేంకటేశ్వరునిఁ గొలువ
నోపకిట్టైతిమయ్యో బదుకా