తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 388

వికీసోర్స్ నుండి


రేకు: 0388-01 రామక్రియ సం: 04-510 నృసింహ

పల్లవి:

నరులాల మునులాల నానా దేవతలాల
పరబ్రహ్మ మీతఁడే ప్రత్యక్షమై వున్నాఁడు

చ. 1:
భావించి చూడరో వీఁడె ప్రహ్లాద వరదుఁడు
సేవించరో తొడమీఁది శ్రీ సతిని
వావిరి నుతించరో వరశంఖచక్రాలవె
కోవిదుఁడు గద్దెమీఁదఁ గొలువై వున్నాఁడు

చ. 2:

చెలఁగి మొక్కరో వీఁడె శ్రీ నరసింహ దేవుఁడు
తెలియరో యీతని తేజోరూపము
అలరి పూజించరో అనంతహస్తము లవె
కొలఁది మీరి విష్ణుఁడు కొలువై వున్నాఁడు

చ. 3:

యిదె శరణనరో హిరణ్యదైత్యహరుని
అదన జపించరో యీ హరినామము
యెదుట శ్రీ వేంకటాద్రిని యహోబలమునందు
కొదలే కాదిమూరితి కొలువై వున్నాఁడు


రేకు: 0388-02 పాడి సం: 04-511 నృసింహ

పల్లవి:

ఇంతులాల చూడరమ్మ ఇద్దరు జాణలే వీరు
చెంత రమాదేవిఁగూడె శ్రీ నరసింహుఁడు

చ. 1:

సరిఁ గొండలెక్కుకొని సరసము లాడుకొంటా
సొరిది మోములు తోఁగి చూచుకొంటాను
విరులచెండులఁగొని వేటులాడుకొంటాను
సిరితోడ విహరించీ శ్రీ నరసింహుఁడు

చ. 2:

భవనాశి లోని నీరు పైఁ జల్లులాడుకొంటాను
నవకపు సిరులను నవ్వుకొంటాను
జవళిఁ గెమ్మోవులు సన్నలఁ జూపుకొంటాను
చివన నిందిరనంటె శ్రీ నరసింహుఁడు

చ. 3:

వేమరుఁ దొడలెక్కుక వీడుదోడు లాడుకొంటా
ప్రేమమునఁ గాఁగిళ్ళఁ బెనఁగుకొంటా
ఆముక శ్రీ వేంకటాద్రి నౌభళాన నిలిచిరి
శ్రీ మహాలక్ష్మి తోడ శ్రీ నరసింహుఁడు


రేకు: 0388-03 బౌళి సం: 04-512 నృసింహ

పల్లవి:

సులభుఁడై వున్నాఁడు సుగ్రీవ నారసింహుఁడు
నెలకొన్నదాసులకు నిధానము వీఁడే

చ. 1:

తుంగభద్రా తటమున తొడపై నిందిర తోడ
సింగారించుకొన్నవేల్పుసింహము వీఁడే
సంగతిగా దేవతలు జయవెట్టి కొలువఁగా
చెంగటనే మహిమలఁ జెలరేఁగీ వీఁడే

చ. 2:

చలువ బండలమీఁద చక్కని కొండల దండ
అలరీని వీరనరహరి వీఁడె
వెలయు శంఖచక్రాల వేవేలు హస్తములతో
బలవంతుఁడై వున్నాఁడు పంతముతో వీఁడే

చ. 3:

పువ్వులతోఁటలనీడ భువనేశ్వరములోన
జవ్వనపు మనుజ కేసరి వీఁడె
ఇవ్వల శ్రీ వేంకటాద్రి నిరవై వరములిచ్చి
నవ్వుమోముతోడ భువనము లేలీ వీఁడే


రేకు: 0388-04 నాట సం: 04-513 నృసింహ

పల్లవి:

వినరయ్య నరసింహ విజయము జనులాల
అనిశము సంపదలు నాయువు నొసఁగును

చ. 1:

మొదలఁ గొలువుకూటమున నుండి కశిపుఁడు
చదివించెఁ బ్రహ్లాదుని శాస్త్రములు
అదన నాతఁడు నారాయణుఁడే దైవమనె
అదరిపడి దైత్యుఁడు ఆతనిఁ జూపుమనె

చ. 2:

అంతటఁ బ్రహ్లాదుఁడు 'అన్నిటానున్నాఁ'డనియె
పంతమున దానవుఁడు బాలునిఁ జూచి
యెంతయుఁ గడఁకతోడ 'ఇందులోఁ జూపు'మని
చెంతనున్న కంబము చేతఁగొని వేసె

చ. 3:

అటమీఁదట బ్రహ్మాండం బదరుచు
కుటిల భయంకర ఘోషముతో
చిట చిట చిటమని పెట పెట పెటమని
పటపట మనుచును బగిలెఁ గంబము

చ. 4:

కులగిరు లదరెను కుంభిని వడఁకెను
తలఁకిరి దైత్యులు తల్లడిలి
కలఁగెను జగములు కంపించె జగములు
ప్రళయ కాలగతిఁ బాటిల్లె నపుడు

చ. 5:

ఘననారసింహుఁ డదె కంబము నందు వెడలె
కనుపట్టె నదిగొ చక్ర జ్వాలలు
మునుకొని వెడలెఁ గార్ముకముక్త శరములు
కనకకశివునకుఁ గలఁగె గుండియలు

చ. 6:

అడరె నద్దేవుని కోపాగ్నులు బెడిదపు -
మిడుఁగురుల తోడుత మిన్నులుముట్టి
పిడుగులురాలేటి భీకర నఖరములు
గడుసు రక్కసునికి గాలములై తగిలె

చ. 7:

తొడికి పట్టి విష్ణుఁడు తొడమీఁద నిడుకొని
కడుపు చించెను వాని గర్వమడఁగ
వెడలెఁ జిల్లున వాని వేఁడి నెత్తురు నింగికి
పొడి వొడియాయ శత్రు భూషణము లెల్లను

చ. 8:

నెళ నెళన విరిచె నిక్క వాని యెముకలు
పెళ పెళ నారిచి పెచ్చు వెరిగె హరి
జళిపించి పేగులు జంద్యాలుగా వేసుకొనె
తళుకుఁ గోరలు తళ తళమని మెరిచె



చ. 9:

పెటలించి నరములు పెరికి కుప్పలువేసి
గుటగుటమని రొప్పె గోవిందుఁడు
చిటిలించి కండలు చెక్కలు వారఁజెండి
కుటిల దానవుఁ జూచి 'ఖో' యని యార్చెను

చ. 10:

తెంచి శిరోజములు దిక్కులకు వాని -
పంచ ప్రాణములు గొనెఁ బరమాత్ముఁడు
అంచెల నీ రీతిని ప్రహ్లాదుని పగ నీఁగె
మించి దేవతలు మితిమీఱి జయవెట్టిరి

చ. 11:

అప్పు డిందిరాదేవి యంకమునఁ గూచుండె వొప్పుగ శాంతమందె నహోబలేశుఁడు
తప్పక కోనేటిదండఁ దానై యిందును నందు చిప్పిల వరములిచ్చీ శ్రీ వేంకటేశుఁడు