తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 387

వికీసోర్స్ నుండి


రేకు: 0387-01 లలిత సం: 04-504

పల్లవి:

కంటిమి నేఁ డిదె గరుడా చలపతి
యింటి వేలుపగు యీశ్వరుఁ డితఁడు

చ. 1:

శ్రీ నరసింహుఁడు చిన్మయ కాంతుఁడు
దానవాంతకుఁడు దయానిధి
నానా మహిమల నమ్మిన వారిని
పూనుక కాచే పోషకుఁ డితఁడు

చ. 2:

దేవాది దేవుఁడు దినకర తేజుఁడు
జీవాంత రంగుఁడు శ్రీ విభుఁడు
దైవ శిఖామణి తలఁచినవారిని
సేవలు గొని కాచే విభుఁడితఁడు

చ. 3:

పరమమూర్తి హరి ప్రహ్లాదవరదుఁడు
కరుణానిధి బుధ కల్పకము
పరగు శ్రీ వేంకటపతి తన దాసుల-
నరుదుగఁ గాచే యనంతుఁ డితఁడు


రేకు: 0387-02 రామక్రియ సం: 04-505 నృసింహ

పల్లవి:

అల్లవాఁడే గద్దె మీఁద నౌభళపు గుహలోన
యెల్లవారిఁ గరుణతో నేలుకొన్నాఁడు

చ. 1:

వుక్కుఁగంభములోఁ బుట్టి వుగ్రనారసింహుఁడు
మొక్కలపు హిరణ్యుని ముందలవట్టి
గక్కనఁ గడుపు చించి ఘనమైన పేగులు
వెక్కసపు జంధ్యాలుగా వేసుకొన్నాఁడు

చ. 2:

కోరలు దీఁడుకొంటాను ఘోర నారసింహుఁడు
సారె సారె నెత్తురులు చల్లుకొంటాను
వీరులైన దానవుల వెదకి వెదకి కొట్టి
గోరి కొనఁ గండలెల్లాఁ గోయుచున్నాఁడు

చ. 3:

విచ్చిన విడిని శ్రీ వేంకటనారసింహుఁడు
పచ్చిదేర నట్టే పకపక నవ్వి
కచ్చు పెట్టి దేవతలఁగాచి యభియమిచ్చి
పెచ్చు రేఁగి సంతోసానఁ బెరుగుచున్నాఁడు


రేకు: 0387-03 మాళవిగౌళ సం: 04-506 హనుమ

పల్లవి:

ఎంతని పొగడవచ్చు నీతని సేవించరో
పొంతనిదే కలశాపుర హనుమంతుఁడు

చ. 1:

పిడికిటఁ బట్టినవి పెద్దపండుల గొలలు
అడరి యెత్తినది మహావాలము
గుడిగొన రాకాసులఁ గొట్టినది వలకేలు
పొడచూపీఁ గలశాపుర హనుమంతుఁడు

చ. 2:

సందడి సమరానకు చాఁచినది పెనుజంగ
అందముగ నిక్కించినదదే వురము
కుందక వీర రసమే కురిసేటిది మొగము
పొందగువాఁడు కలశాపుర హనుమంతుఁడు

చ. 3:

వుదుటన మెలఁగేవి వొద్దికైన పాదాలు
త్రిదశుల మెప్పించేది దివ్యరూపము
అదె శ్రీ వేంకటేశు బంటయి నిలుచున్నాఁడు
వొదలుచుఁ గళశాపుర హనుమంతుఁడు


రేకు: 0387-04 శంకరాభరణం సం: 04-507 కృష్ణ

పల్లవి:

ఎంత భాగ్యవంతులమో యీతనిఁ బొడగంటిమి
చెంతనుండి మమ్మునేలే శ్రీ విట్ఠలేశుఁడు

చ. 1:

తుంగభద్రా తటమున తొంటి పర బ్రహ్మము
అంగవించి సాకారమై వున్నాఁడు
సంగతితో రుక్మిణియు సత్యభామల నడుమ
చెంగలించీ మహిమల శ్రీ విట్ఠలేశుఁడు

చ. 2:

అందపుఁ బైఁడిమేడలో నాదిమూర్తియైన దేవుఁ -
డందరికిఁ బ్రత్యక్షమై యున్నాఁడు
సందడించి గోపికా జనముల తోడుత
చెంది వున్నాఁడిదివో శ్రీ విట్ఠలేశుఁడు

చ. 3:

వెలసి వనాల లోన వేద వేద్యుఁడైన హరి
అలరి కృష్ణావతారమై యున్నాఁడు
యెలమి శ్రీ వేంకటేశుఁ డితఁడే పదారువేల
చెలులతోఁ గూడినాఁడు శ్రీ విట్ఠలేశుఁడు


రేకు: 0387-05 నాట సం: 04-508 నృసింహ

పల్లవి:

ఇట్టి సుద్దులితనివి ఇదివో కొలువున్నాఁడు
నట్టనడుమ నీ సుగ్రీవ నారసింహుఁడు

చ. 1:

పగలూ రాతిరీఁ గాని పటు సంధ్యా కాలమందు
మొగిఁ బచ్చీ వెచ్చీగాని మొనగోళ్ళచే
గగనమూ నేలాఁ గాని గనమైన తొడమీఁద
నగుతా హిరణ్యుఁ గొట్టె నరసింహ దేవుఁడు

చ. 2:

వెలుపలా లోనాఁ గాని వెడఁగుగడపమీఁద
తలి తండ్రి గాని యట్టి తావునఁ బుట్టి
మొలచి చిగిరించని ముదురుఁగోరలతోడ
నలి హిరణ్యు జంకించె నరసింహ దేవుఁడు

చ. 3:

మానిసీ మెకమూఁగాని మంచి యాకారముతోడ
పూని యిల్లూఁ బందిలీఁ గాని గుహలో
ఆనుక హిరణ్యుని నడఁచీ శ్రీ వేంకటాద్రి
నానా దిక్కుల నేలిన నరసింహ దేవుఁడు


రేకు: 0387-06 బౌళి సం: 04-509 హనుమ

పల్లవి:

అదె చూడరయ్యా పెద్ద హనుమంతుని
గుదిగొని దేవతలు గొనియాడేరయ్యా

చ. 1:

వుదయాస్త శైలములు వొక జంగగాఁ జాఁచె
అదివో ధ్రువ మండల మందె శిరసు
చదివె సూర్యుని వెంట సారె మొగము ద్రిప్పుచు
యెదుట నీతని మహి మేమని చెప్పేమయ్యా

చ. 2:

దండిగా బ్రహ్మాండముదాఁకఁ దోఁక మీఁదికెత్తె
మెండగు దిక్కులు నిండ మేను వెంచెను
గుండుగూడ రాకాసులఁ గొట్టఁగఁ జేతులు చాఁచె
అండనీతని ప్రతాప మరుదరుదయ్యా

చ. 3:

దిక్కులు పిక్కటిలఁగ దేహరోమములు వెంచె
పక్కన లోకములకుఁ బ్రాణమై నిల్చె
ఇక్కడ శ్రీ వేంకటేశు హితవరిబంటాయ
మిక్కిలి నీతనిలావు మేలు మేలయ్యా