తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 368

వికీసోర్స్ నుండి


రేకు: 0368-01 గుజ్జరి సం: 04-399 శరణాగతి

పల్లవి:

ఇతరములన్నియునడుమంత్రములే యెంచిచూచినను యింతాను
హితవగుబందుగుఁ డీశ్వరుఁడొకఁడే యితని మరవకుమీ జీవాత్మా

చ. 1:

భవకూపంబుల బడలెడినాఁడు పాయనిబంధువుఁడితఁడొకఁడే
దివిస్వర్గంబునఁ దేలెడినాఁడు తిరుగఁబాయకెపు డితఁడొకఁడే
నవనరకంబుల నలఁగెడినాఁడు నటనలఁ బాయ డితఁడొకఁడే
యివలనవలహృదయేశుఁడు విష్ణుఁడుయీతనిమరవకుమీ జీవాత్మా

చ. 2:

పశుమృగాదుల వొడలెత్తినప్పుడు పాయనిబందుగుఁ డితఁడొకఁడే
విశదపు దుఃఖపువేళలనైనా విడువనిబంధువుఁ డితఁడొకఁడే
శిశువైనప్పుడు వృద్దైనప్పుడు చిత్తపుబందుగుఁ డితఁడొకఁడే
దశావతారపు విష్ణుఁడొకఁడే యితఁడని తలఁచుమీ జీవాత్మా

చ. 3:

భావజకేలినిఁ జొక్కినప్పుడును ప్రాణబంధువు డితఁడొకఁడే
యీవల నావల నిహపరములలో నిన్నిటిబంధువుఁ డితఁడొకఁడే
దైవము దానని శరణనియెడు నను దగ్గరికాచెను యితఁడొకఁడే
శ్రీవేంకటగిరి నాయకుఁ డితడే చేరి భజించుము జీవాత్మా


రేకు: 0368-02 తెలుగుగాంబోది సం: 04-400

పల్లవి:

తెగఁగోయుటకు హరి దివ్య నామ కీర్తనము
వెగటు నాయుధ మిది విడువకుమీ మనసా

చ. 1:

భవపాశములచేతఁ బట్టువడ్డదేహికి
యివలఁ గర్మపాశాలు యివియుఁ గొన్నే
తవిలె నాశాపాశతతులవి యొకకొన్ని
కవగూడఁ: దవిలెను కామపాశములు

చ. 2:

పమ్మి లోక పురుణాను బంధవు జీవికి
యిమ్ముల సంసార బంధా లివియుఁ గొన్నే
కమ్మరఁ బుణ్య పాప కలుష బంధాలు గొన్ని
సమ్మతించ భోగములే సకల బంధములు

చ. 3:

శ్రీ వేంకటేశ్వరుఁడు చిత్తములో నున్నవాఁడు
జీవుఁడు నాతనిలోనే చేకొని పాయఁడు వీఁడె
భావించి కొలిచిన పాయును మాయలన్ని
దేవుఁ డితనినమ్మిన తీరుఁబో దుఃఖములు


రేకు: 0368-03 గుండక్రియ సం: 04-401 శరణాగతి

పల్లవి:

హరి నీకే శరణని గెలుచుటగాక
యిరవుగ నెరఁగఁగ నెవ్వరి తరము

చ. 1:

తను వికారములు తరవులు వెట్టిన
కొనయెరుకైనా కొరతవడు
మనసు వికారము మమతలఁ దగిలిన
యెనసి యెదురుపడ నెవ్వరి తరము

చ. 2:

కంతు వికారము కన్నులఁగప్పిన
పంతపు విరతియు బయలౌను
చింతాలహరులు చీఁదర రేఁగిన
యింతయు వీడ్కొన వెవ్వరితరము

చ. 3:

అతిగుణవికార మాసలఁ బెట్టిన
సతతయోగములు జడనుపడు
మతి శ్రీ వేంకటపతి నిన్నుఁ గొలిచిన
యితరము దగ్గర నెవ్వరితరము


రేకు: 0368-04 మాళవిగౌళ సం: 04-402 శరణాగతి

పల్లవి:

నారాయణ నిను నమ్మిన నాకును
మేరతో నీపాదమే గతి గలిగె

చ. 1:

చింతా జలధులఁ జిక్కిన దాఁటించ-
నంతట నీ పాద మదె తేప
కాంతల మోహపు కట్లు దెంచఁగ
పంతపు నీ పాద పరశువు గలిగె

చ. 2:

అతిదురితపంక మందినఁ గడుగఁగ
మితి నీ పాదమే మిన్నేరు
రతిఁ గర్మజ్ఞులు రాఁజిన నార్చఁగ
వ్రతము నీపాదమే వానయై నిలిచె

చ. 3:

జిగి నజ్ఞానపు చీఁకటి వాయఁగ
తగు నీ పాదము దయపు రవి
నగు శ్రీ వేంకటనాథ నన్నేలఁగ
మిగులఁగ నీ పాదమే శరణంబు


రేకు: 0368-05 మలహరి సం: 04-403 శరణాగతి

పల్లవి:

శరణంబితఁడే సకలము నాకును
వెరవున మనసా వెతకవో యితని

చ. 1:

అభయం బొసఁగేటియతఁ డెవ్వఁడు మును
యిభరక్షకుఁడతఁ డెవ్వడు
వుభయ విభూతుల కొడయం డెవ్వఁడు
ప్రభువతఁడే నా పాలి దేవుఁడు

చ. 2:

శరణాగతులకు సరి దా పెవ్వఁడు
యిరువుగ శ్రీ పతి యెవ్వఁడు
అరి దుష్టదైత్యహంతకుఁ డెవ్వడు
పరమును నతఁడే నాపాలి దేవుఁడు

చ. 3:

ఆది శంఖ చక్రాయధుఁ డెవ్వఁడు
యే దెసఁ బూర్ణు డెవ్వఁడు
వేదమయుఁడు శ్రీ వేంకటపతియై
పాదాయ నిదె నాపాలిదేవుఁడు