తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 367

వికీసోర్స్ నుండి


రేకు: 0367-01 బౌళి సం: 04-౩93 దశావతారములు

పల్లవి:

ఓహో యెంతటివాఁడే వొద్దనున్నవాఁడే హరి
సాహసపు గుణముల చతురుఁడా యితఁడు

చ. 1:

జలధిలోఁ బవళించి జలనిధి బంధించి
జల నిధి కన్యకను సరిఁ బెండ్లాడి
జలనిధిలో నీఁది జలనిధి మధియించి
జలధి వెరించిన చలమరా యితఁడు

చ. 2:

ధరణికిఁ బతియై ధరణి గ్రుంగిన నెత్తి
ధరణికూఁతురుఁ దానె తగఁ బెండ్లాడి
ధరణిఁ బాదము మోపి ధరణి భారము దించి
ధరణీ ధరుఁడైన దైవమా ఇతఁడు

చ. 3:

కొండ గొడుగుగ నెత్తి కొండఁ దూఁటువడ నేసి
కొండకిందఁ గుదురై కూచుండి
కొండపై శ్రీ వేంకటాద్రి కోనేటిరాయఁడై
కొండ వంటి దేవుఁడైన కోవిదుఁడా ఇతఁడు


రేకు: 0367-02 శుద్ధవసంతం సం: 04-394 వైరాగ్య చింత

పల్లవి:

ఏమని చెప్పెద నిటమీఁద హరీ
శ్రీ మంతుఁడ నినుఁ జేరితి మిదివో

చ. 1:

వినుచున్నారము వెనకటిపాట్లు
కనుచున్నారము కలఁగేటివారల
దిన దిన భావము తెలిసీఁ దెలియదు
మనసున భయ మిసుమంతయు లేదు

చ. 2:

భువి నెరుఁగుదు మిదె పుట్టెడి దెసలను
తవిలి మరణములు దలఁచెద మట్లనె
వివరపు టాసలు విడిచీ విడువవు
నవమగు విరక్తి నాఁటదు వోయె

చ. 3:

చదివెద మిదివో సకల శాస్త్రములు
వెదకెద మిదె శ్రీ వేంకటేశ నిను
మదిలోనుండగఁ మరచివుంటి మిదె
యెదుటఁగంటి మిఁక యేలాపనులు


రేకు: 0367-03 లలిత సం: 04-395 శరణాగతి

పల్లవి:

ఆచార విచారా లవియు నే నెరఁగ
వాచామ గోచరపు వరదుఁడ నీవు

చ. 1:

తపమొక్కటే నాకుఁ దగు నీ శరణనుట
జపమొక్కటే నిన్ను సారెకు నుతించుట
వుపమొక్కటే నీవె వున్నతుఁడవంట
విపరీత విజ్ఞాన విధులేమి నెరఁగ

చ. 2:

కర్మమొక్కటే నీ కైంకర్యగతి నాకు
ధర్మమొక్కటే నీ దాసాను దాస్యము
మర్మమొక్కటే నా మతి నిన్నుఁ దలఁచుట
అర్మిలి నింతకంటే నవల నే నెరఁగ

చ. 3:

బలిమియొక్కటే నాకు భక్తి నీపైఁ గలుగుట
కలిమి యొక్కటే నీవు గలవని నమ్ముట
యెలమితో శ్రీ వేంకటేశ నీవు గతిదక్క
పలుబుద్దులు నేఁబొరలు భావనలేనెరఁగ


రేకు: 0367-04 లలిత సం: 04-396 శరాణగతి

పల్లవి:

పనిలే దేమియు నాకు పంపుడు నీబంట నింతే
యెనపిన తెడ్డు చౌ లెరుఁగునటవయ్యా

చ. 1:

మనసు నీ విచ్చితివి మాఁటలు నీ విచ్చితివి
తనువు నీ విచ్చితివి యంతర్యామీ
చెనసి నీదువల్లఁ జేసేకర్మపు బంట
నినుపుఁగణఁజాల నించుకొనవయ్యా

చ. 2:

సత్తున నీ విచ్చితివి చలము నీ విచ్చితివి
తత్తర మిచ్చితివి యంతర్యామి
యిత్తల నావల నీవు యెందుకైనఁ బెరరేఁచి
యెత్తుక యేమైన గడియించుకొనవయ్యా

చ. 3:

మాయలు నీ విచ్చితివి మదము నీ విచ్చితివి
ఆయపు శ్రీ వేంకటాద్రి యంతర్యామి
యేయెడ నేఁ జేసేటి యిన్నెపరాధాలు
వేయయిన నీ వెనక వేసుకొనవయ్యా


రేకు: 0367-05 బౌళి సం: 04-397 శరణాగతి

పల్లవి:

నిచ్చలూ లోకము చూచి నివ్వెరగయ్యీ నాకు
చెచ్చెర శ్రీ హరి నీ చిత్తము నాభాగ్యము

చ. 1:

జీవ మతిసూక్ష్మము చిత్తము చంచలము
భావము నిరాకారము భవమెల్ల నెయ్యము
యే విధులఁ బొరలెనో యిది నాబ్రదుకు
దేవుఁడ నీచిత్తము నాతేఁకువైన భాగ్యము

చ. 2:

వూరుపెల్ల గాలి నా వుపమెల్ల మాయ
కూరిమెల్ల మొరఁగు నా గుణము విచారము
నేరుపేదో నేరమేదో నిజము దెలియదు
శ్రీ రమణుఁడవు నీ చిత్తము నా భాగ్యము

చ. 3:

కాలము పారేటిదాడి కాయము తూంట్లబొంత
ఆలరి శ్రీ వేంకటేశ యది నీచేఁత
యేలాగు లెరఁగను యిటు నీ శరణనుటే
శీలము నాకు నీ చిత్తము నా భాగ్యము


రేకు: 0367-06 పాడి సం: 04-398 విష్ణు కీర్తనం

పల్లవి:

అమ్మే దొకటియును యసిమలోదొకటి యని
కమ్ముకొని నీయందే కలిగె నీమాఁట

చ. 1:

సరవితో నిను నుపనిషద్వాక్యములయందు
పురుషోత్తముడవనుచుఁ బొగడఁగాను
అరిది నారాయణివియై యమృత మొసఁగుచో
అరయ శ్రుతిదె విరోధంబాయ నీమాఁట

చ. 2:

తలపోయ ధర్మసంన్థాపనుఁడవని నిన్ను
చెలరేఁగి శాస్త్రములు చెప్పఁగాను
తలఁక కిటు గోప పరదారగమనము నీవు
యిలఁ జేయ శాస్త్రవిరహితమాయ నీమాఁట

చ. 3:

వైకుంఠపతి వనుచు వడిఁ బురాణములెల్ల
యేకమొకటే వశియించఁగాను
యీకడ శ్రీ వేంకటేశ్వరుఁడవైతి విదె
చేకొలఁది నిటు నీకె చెల్లు నీమాఁట