తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 347

వికీసోర్స్ నుండి

రేకు: 0347-01 శ్రీరాగం సం: 04-274 రామ


పల్లవి :

ఏడకేడ నీచెరిత లేమని పొగడవచ్చు
యీడులేని మహిమల యినవంశరామా


చ. 1:

పరమాన్నములోఁబుట్టి పక్కనఁ దాటకిఁ జంపి
సరుస విశ్వామిత్రుయజ్ఞము గాచి
హరునివిల్లు విరిచి యట్టె సీతఁ బెండ్లాడి
పరశురామునిచేత బలము చేకొంటివి


చ. 2:

వైపుగాఁ సుగ్రీవుఁ గూడి వాలి నొక్కకోల నేసి
యేపున జలధి గట్టి యెసగితివి
దీపించు రావణుఁ జంపి దివిజులను మన్నించి
యేపుగా విభీషణుని రాజ్య మేలించితివి


చ. 3:

సీతతోఁ బుష్పకమెక్కి జిగి నయోధ్యకు వచ్చి
గాతల రాజ్యపట్టము గట్టుకొంటివి
యీతల శ్రీవేంకటాద్రి నిటు విజనగరాన
నీతితో నెలవుకొని నెగడితివి

రేకు:0347-02 ఆహిరి సం: 04-275 నృసింహ


పల్లవి :

సులభుఁ డీతఁ డిదివో సుగ్రీవనారసింహుడు
చెలఁగి మొక్కులు మొక్కి సేవించరో


చ. 1:

నవ్వులమోమువాఁడు నానామహిమలవాఁడు
రవ్వలుగా దేవతల రక్షించేవాఁడు
పువ్విళ్ళూర కంభములో నుదయించినవాఁడు
నివ్వటిల్లు ప్రతాపాన నెగడినవాఁడు


చ. 2:

హేమపుచాయలవాఁడు యెదుటఁగొల్వున్నవాఁడు
కోమలిఁ దొడపై నిడుకొన్నవాఁడు
కోమలపుమేనివాఁడు గొప్పకిరీటమువాఁడు
చేముంచి హిరణ్యదైత్యుఁ జించినవాఁడు


చ. 3:

వాలుకగోళ్లవాఁడు వాఁడికోరలవాఁడు
మేలిమికరుణతోడ మించినవాఁడు
వోలిఁ దుంగభద్రకాడనుండి శ్రీవేంకటాద్రిని
లీలతోఁ బ్రహ్లాదుని కేలికెయైనవాఁడు

రేకు: 0347-03 చాయ సం: 04-276 రామ


పల్లవి :

శరణు శరణు నీకు జగదేకవందిత
కరుణతో మమ్ము నేలు కౌసల్యనందన


చ. 1:

ఘనరణరంగవిక్రమ దశరథపుత్ర
వినుతామనస్తోమ వీరరాఘవ
మునులును రుషులును ముదమునొందిరి నీవు
జననమందినందుకు జానకీరమణ


చ. 2:

సులభ లక్ష్మణాగ్రజ సూర్యవంశతిలక
జలధిబంధన విభీషణవరద
తలఁకి యసురలు పాతాళము చొచ్చిరి నీవు
విలువిద్య నేర్చితేనే విజయరామ


చ. 3:

రావణాంతక సర్వరక్షక నిర్మలభక్త-
పావన దివ్యసాకేతపట్టణవాస
వేవేలుగ నుతించిరి వెస హనుమంతాదులు
సేవించిరి నినుఁ జూచి శ్రీవేంకటేశ

రేకు: 0347-04 నాట సం: 04-277 రామ


పల్లవి :

రాముఁడు లోకాభిరాముఁడందరికి రక్షకుఁడీతనిఁ దెలిసి కొలువరో
కామితఫలదుఁడు చరాచరములకుఁ గర్తయైనసర్వేశ్వరుడితఁడు


చ. 1:

తలఁప దశరథుని తనయుఁడట తానెతారకబ్రహ్మమట
వెలయ మానుషపు వేషమట వెగటుగ హరువిల్లు విరిచెనట
అలరఁగ తానొక రాజట పాదాన నహల్యశాపము మాన్చెనట
సొలవక దైవికమానుషలీలలు చూపుచు మెరసీఁ జూఁడరోయితఁడు


చ. 1:

జగతి వసిష్ఠునిశిష్యుఁడట జటాయువుకు మోక్ష మిచ్చెనట
అగచరులే తనసేనలట అంబుధి కొండలఁగట్టినట
మగువకొరకుఁగానట కమలాసను మనుమనిఁ రావణుఁ జంపెనట
తగ లౌకికి వైదికములునొక్కట తానొనరించీఁ జూడరో యితఁడు


చ. 1:

వెస నమరుల వరమడిగెనట విభీషణపట్టము గట్టెనట
యెసగ నయోధ్యకు నేలికట యింద్రాదులకుఁ గొలువిచ్చెనట
పొసగ శ్రీవేంకటగిరి నివాసమట భువనము లుదరంబున ధరించెనట
సుసరపు సూక్ష్మాధికములు తనందుఁ జూపుచునున్నాఁడు చూడరో యితఁడు

రేకు: 0347-05 గౌళ సం: 04-278 హనుమ


పల్లవి :

అఱిముఱి హనుమంతుఁ డట్టిబంటు
వెఱపు లేని రఘువీరునికి బంటు


చ. 1:

యేలికను దైవముఁగా నెంచి కొల్చేవాఁడే బంటు
తాలిమి గలిగిన యాతఁడే బంటు
పాలుమాలక యేపొద్దు పనిసేయువాఁడే బంటు
వేళ గాచుకవుండేటి వెరవరే బంటు


చ. 2:

తను మనోవంచనలెంతటా లేనివాఁడే బంటు
ధనముపట్టున శుద్ధాత్మకుఁడే బంటు
అనిశము నెదురు మాటాడనివాఁడే బంటు
అనిమొనఁ దిరుగనియతఁడే బంటు


చ. 3:

చెప్పినట్లనే నడచినయాతఁడే బంటు
తప్పులేక హితుఁడైనాతఁడే బంటు
మెప్పించుక విశ్వాసాన మెలఁగువాఁడే బంటు
యెప్పుడును ద్రోహిగాని హితుఁడే బంటు


చ. 4:

అక్కర గలిగి కడు నాప్తుఁడైనవాఁడే బంటు
యెక్కడా విడిచిపోనియిష్టుఁడే బంటు
తక్కక రహస్యములు దాఁచినవాఁడే బంటు
కక్కసీఁడుగాక బత్తిగలవాఁడే బంటు


చ. 5:

కానిపనులకు లోనుగానివాఁడే బంటు
ఆనాజ్ఞ మీరనియాతఁడే బంటు
నానాగతి శ్రీవేంకటోన్నతుఁడైనయతనికి
తా నిన్నిటా దాసుఁడైనధన్యుఁడే బంటు