తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 327

వికీసోర్స్ నుండి

రేకు: 0327-01 దేశాక్షి సం: 04-154అధ్యాత్మ


పల్లవి :

ఇన్నిటికి మూలము యెప్పుడు నీవే
పన్ని మామీఁద నేరాలు పచరించకువయ్యా


చ. 1:

కోటానఁగోటులు మదిఁ గోరికలు
చీటికి మాటికి నివే చిగిరించీని
వాటమై యెవ్వరికిని వసముగావు
పాటించి వీటిని వొప్పనగొనవయ్యా


చ. 2:

లక్షోపలక్షలు కర్మలంపటములు
అక్షయపు తీగెలై అల్లుకొనీని
వీక్షించ నెన్నేఁ గలవు వింతవింతలు
రక్షించ నిన్నిటికి భారము నీదేయయ్యా


చ. 3:

నానాముఖములు పుణ్యములెల్లాను
తానక భోగములై తగిలించీని
మానుపరా దలమేలుమంగపతివి
శ్రీనాథ శ్రీవేంకటేశ చిత్తగించవయ్యా

రేకు: 0327-02 మాళవి సం: 04-155 హనుమ


పల్లవి :

అందరికి నెక్కుడైన హనుమంతుఁడు
అందుకొనె సూర్యుఫలమని హనుమంతుఁడు


చ. 1:

బల్లిదుఁడై లంక చొచ్చి బలురాకాసులఁ గొట్టి
హల్ల కల్లోలముచేసె హనుమంతుఁడు
వొల్లనె రాముల ముద్దుటుంగరము సీతకిచ్చె
అల్లదె నిలుచున్నాఁడు హనుమంతుఁడు


చ. 2:

దాకొని యాకె ముందర తన గుఱుతెరుఁగించి
ఆకారమటు చూపె హనుమంతుఁడు
చేకొని శిరోమణి చేతఁబట్టి జలనిధి
ఆకసాన దాఁటివచ్చె హనుమంతుఁడు


చ. 3:

కొంకకిట్టె సంజీవికొండ దెచ్చి రిపులకు
నంకకాఁడై నిలిచెను హనుమంతుఁడు
తెంకినే శ్రీవేంకటాద్రి దేవుని మెప్పించినాఁడు
అంకెఁగలశాపుర హనుమంతుఁడు

రేకు: 0327-03 పాడి సం: 04-156 రామ


పల్లవి :

రామా దశరథరామా నిజ సత్య-
కామా నమో నమో కాకుత్సరామ


చ. 1:

కరుణానిధి రామ కౌసల్యానందన రామ
పరమ పురుష సీతాపతిరామ
శరధి బంధన రామ సవన రక్షక రామ
గురుతర వంశ కోదండ రామ


చ. 2:

దనుజహరణ రామ దశరథసుత రామ
వినుతామర స్తోత్ర విజయరామ
మనుజావతార రామ మహనియ్యగుణరామ
అనిలజప్రియ రామ అయోధ్యరామ


చ. 3:

సులలితయశ రామ సుగ్రీవవరద రామ
కలుషరావణభయంకర రామ
విలసితరఘురామ వేదగోచర రామ
కలితప్రతాప శ్రీవేంకటగిరిరామ

రేకు: 0327-04 ముఖారి సం: 04-157 నృసింహ


పల్లవి :

సేవించరో జనులాల చిత్తజగురుఁ డీతఁడు
కేవలదయానిధి సుగ్రీవనారసింహుఁడు


చ. 1:

వేయిచేతులతోడ వెన్నెలనవ్వుల తోడ
చాయలు దేరేటి శంఖచక్రాలతోడ
అయితమై వున్నవాఁడు అదె సింహాసనముపై
శ్రీయుతుఁడై యెదుట సుగ్రీవనారసింహుఁడు


చ. 2:

కుంకుమగోళ్ల తోడ కోరదౌడలతోడ
అంకెలరవిచంద్రనయనములతో
తెంకి నసురలఁ గొట్టి దేవతలకందరికి
కింకలెల్లాఁ బాపెను సుగ్రీవనారసింహుఁడు


చ. 3:

బిరుదు పెండేలతోడ పీతాంబరముతోడ
సరిఁ గిరీటాదిభూషణములతో
సిరులకెల్లా నెలవై చెలఁగి శ్రీవేంకటాద్రి-
గిరిమీఁద వెలసెను సుగ్రీవనారసింహుఁడు

రేకు: 0327-05 నాట సం: 04-158 హనుమ


పల్లవి :

ఎక్కుడు బ్రహ్మపట్టాన కిదె కాచుకున్నావాఁడు
పిక్కటిల్లి సంతోసానఁ బెద్దహనుమంతుఁడు


చ. 1:

తూరుపుఁ బడుమరాను దొడ్డగా జంగ చాఁచి
సారెకుఁ నర్కునివద్దఁ జదివీ వాఁడే
ధీరతతోఁ దనమేను దిక్కులెల్లాఁ బిక్కటిల్ల
బీరముచూపీ వాఁడె పెద్దహనుమంతుఁడు


చ. 2:

మిన్ను నేల నేకముగా మించినవాల మెత్తి
సన్నుతిగా వలకేల చాఁచినవాఁడు
పన్నుగడై రాఘవునిబంట్లలోపలనెల్లా
పెన్నిధియై యున్నవాఁడు పెద్దహనుమంతుఁడు


చ. 3:

మరిగి రేయుఁబగలు మతంగపర్వతమాడ
బిరుదులతోడను బెరసీ వాఁడే
యిరవై శ్రీవేంకటేశుహితుఁడై యెప్పుడుఁ బెచ్చు-
పెరుగుచు నున్నవాఁడు పెద్దహనుమంతుఁడు

రేకు: 0327-06 బౌళి సం: 04-159 రామ


పల్లవి :

ఇతఁడు తారకబ్రహ్మ మీతఁడు సర్వేశ్వరుడు
రతికెక్కఁ గొలిచిన రక్షించు నితఁడు


చ. 1:

తరణివంశజుడై తాటకను హరియించి
అరుదుగ విశ్వామిత్రుయాగము గాచి
హరునివిల్లు విరిచి యట్టె సీతఁ బెండ్లియాడి
పరశురాముని నిజబలిమి చేకొనెను


చ. 2:

మునులకభయమిచ్చి మొగి నసురలఁ ద్రుంచి
ఘనమైన మాయామృగముఁ జంపి
కినిసి వాలిఁ గొట్టి సుగ్రీవునిఁ బట్టముగట్టి
వనధి బంధించి లంక వడిఁ జుట్టుముట్టెను


చ. 3:

బలు రావణునిఁ జంపి పుష్పకముపైఁ దాఁ జేకొని
లలి విభీషణునకు లంక ఇచ్చి
చెలఁగి యయోధ్య యేలి శ్రీవేంకటాద్రిమీఁద
వెలయ రాముఁడు దానై విశ్వమెల్లా నేలెను