కంకణము/కంకణము వా యువశంబగుట

వికీసోర్స్ నుండి

కంకణము వా యువశంబగుట

శా. ఆపై మా కుపకారివోలె బవనుం డం తంత నేతెంచి, మీ
   కూపస్థాజ్ఞతవోవఁగా సకలదిక్కూటంబులం జూచి, ధీ
   నై పుణ్యంబు గొనుండు రండనుచు నానాభంగులం ద్రిప్పె మ
   మ్మాపూర్వాచల పశ్చిమాచల సమస్తాకాశభాగంబులన్.

ఉ. భూరిపురాకృత ప్రకటపుణ్య ఫలానుభవంబు నేటితోఁ
   దీరెనొ ఖేచరత్వమును దీరునొ నా ఘనసారహారనీ
   హారపటీరచారుధవళాకృతు లెల్లఁ దొలంగిపోయి దు
   ర్వారవి కారగాడతిమిరచ్ఛవి మాకు ఘటిల్లె నంతటన్.

మ. బలభిద్ఘోరశతారధారలకు మున్ బా ల్గాక తాఁ బుత్రపౌ
    త్రులతోగోత్ర సమృద్ధిగాంచియవిభీతుండై కుటుంబంబుతో
    జలధిం బాసిన మేనకాత్మజు వియత్సంచారమోనాఁ గడున్
    జెలఁగెన్ నాఁడతిభీక రాకృతులమాజీమూత సంచారముల్.

సీ. అమరాధిపతి వీఁడు నాక్రమింపఁగ నాఁడు
           దండెత్తి చను సోఁకుదం డనంగ
   దీపంబు లిడి భూసతీమణుల్ గగనంపుఁ
           బీఁటపైఁ బాఱించు కాటు కనఁగ
   అంజనా చలశిఖరాగ్రమం దుదయించి
          చదలంటఁ బ్రవహించు నది యనంగ
   నరకలోకంబున కరుగు ధూర్తులవెంటఁ
          బఱువెత్తు తత్పాపపటల మనఁగ

ఆ. గుబురుగుబురు లగుచు గుంపుగుంపులు గూడి
   యింత లంత లై యనంతము లయి
   కడకు నేకమగుచు ఘనఘనాఘనముల
   సంచయంబు మింట సంచరించె.

ఆ. చదలు చెదలువాఱఁ జెదపుర్వుల విధానఁ
   బొదలు తారలెల్ఁల జెదలఁ బాపు
   తారుపూఁత తీరు తనరారు జీమూత
   జాతమం దడంగి సమసి పోయె.

క. లేశము గనము భవిష్య
   న్నాశము, పవమానగతులు నమ్ముకొనుచు ని
   ట్లాశా భ్రమణంబున సక
   లాశా భ్రమణం బొనర్చి యలసితి మంతన్.