అధ్యాయము - ౧

వికీసోర్స్ నుండి
భాగవతము - ప్రధమ స్కంధము
అధ్యాయాలు
1. ప్రారంభము
2. అధ్యాయము - ౧
3. అధ్యాయము - ౨
4. అధ్యాయము - ౩
5. అధ్యాయము - ౪
6. అధ్యాయము - ౫
7. అధ్యాయము - ౬
8. అధ్యాయము - ౭
9. అధ్యాయము - ౮
10.అధ్యాయము - ౯
11.అధ్యాయము - ౧౦
12.అధ్యాయము - ౧౧
13.అధ్యాయము - ౧౨
14.అధ్యాయము - ౧౩
15.అధ్యాయము - ౧౪
16.అధ్యాయము - ౧౫
17.అధ్యాయము - ౧౬
18.అధ్యాయము - ౧౭
19.అధ్యాయము - ౧౮
20.అధ్యాయము - ౧౯

సీ.

విశ్వజన్మస్థితి విలయంబు లెవ్వనివలన నేర్పడు ననువర్తనమున

వ్యావర్తనమునఁ గార్యములం దభిజ్ఞుఁడై తాన రాజగుచుఁ జిత్తమునఁ జేసి

వేదంబు లజునకు విదితముల్ గావించె నెవ్వఁడు బుధులు మోహింతు రెవ్వ

నికి నెండ మావుల నీటఁ గాచాదుల నన్యోన్యబుద్ది దా నడరునట్లు

ఆ.

త్రిగుణసృష్టి యెందు దీపించి సత్యము భంగిఁ దోఁచు స్వప్రభానిరస్త

కుహకుఁ డెవ్వఁ డతనిఁ గోరి చింతించెద ననఘ విశ్వమయుని ననుదినంబు. 32


వ.

ఇట్లు "సత్యం పరం ధీమహి" యను గాయత్రీ ప్రారంభంబున గాయత్రీనామ

బ్రహ్మరూపంబై మత్స్యపురాణంబులోన గాయత్రి నధికరించి ధర్మవిస్తరంబును

వృత్రాసుర వధంబును నెందుఁ జెప్పంబడు నదియ భాగవతంబని పలుకుటం జేసి

యీ పురాణంబు శ్రీ మహాభాగవతంబన నొప్పుచుండు. 33


సీ.

శ్రీమంతమై మునిశ్రేష్ఠకృతంబైన భాగవతంబు సద్భక్తితోడ

వినఁగోరువారల విమలచిత్తంబులఁ జెచ్చెర నీశుండు చిక్కుఁ గాక

యితర శాస్త్రంబుల నీశుండు చిక్కెనె మంచివారలకు నిర్మత్సరులకుఁ

గపటనిర్ముక్తులై కాంక్షసేయక యిందుఁ దగిలియుండుట మహాతత్త్వ బుద్ధి

తే.

పరఁగ నాధ్యాత్మికాది తాపత్రయంబు నడఁచి పరమార్థభూతమై యఖిల సుఖద

మై సమస్తంబుగాకయు నయ్యునుండు వస్తువెఱుఁగంగఁ దగు భాగవతమునందు. 34


ఆ.

వేదకల్పవృక్షవిగళితమై శుక

ముఖసుధాద్రవమున మొనసియున్న

భాగవత పురాణ ఫలరసాస్వాదన

పదవిఁ గనుఁడు రసిక భావవిదులు. 35


నైమిశారణ్య వర్ణనము[మార్చు]

క.

పుణ్యంబై మునివల్లభ

గణ్యంబై కుసుమఫలనికాయోత్థిత సా

ద్గుణ్యమయి నైమిశాఖ్యా

రణ్యంబు నుతింపఁదగు నరణ్యంబులలో. 36


వ.

మఱియును మధువైరి మందిరంబునుం బోలె మాధవీమన్మథ సహితంబై బ్రహ్మ

గేహంబునుం బోలె శారదాన్వితంబై నీలగళసభానికేతనంబునుం బోలె వహ్ని వరుణ

సమీరణ చంద్ర రుద్ర హైమవతీ కుబేర వృషభ గాలవ శాండిల్య పాశుపత జటిపటల

మండితంబై బలభేదిభవనంబునుం బోలె నైరావతామృత రంభాగిణికాభిరామంబై

మురాసురునిలయంబునుంబోలె నున్మత్తరాక్షసవంశ సంకులంబై ధనదాగారంబునుం

బోలె శంఖకుందముకుంద సుందరంబై రఘురామ యుద్ధంబునుం బోలె నిరంతర

శరానలశిఖాబహుళంబై పరశురాము భండనంబునుం బోలె నర్జునోద్భేదంబై దానవ

సంగ్రామంబునుంబోలె నరిష్ట జంభనికుంభశక్తియుక్తంబై కౌరవసంగరంబునుం బోలె

ద్రోణార్జున కాంచనస్యందన కదంబసమేతంబై కర్ణుకహంబునుం బోలె మహోన్నత

శల్య సహకారంబై సముద్రసేతుబంధనంబునుంబోలె నలనీలపనసాదిప్రదీపితంబై

భర్గుభజనంబునుం బోలె నానాశోకలేఖాకలితంబై మరు కోదండంబునుం బోలెఁ

బున్నాగశిలీముఖ భూషితంబై నరసింహరూపంబునుం బోలెఁ గేసర కరజ

కాంతంబై నాట్యరంగంబునుం బోలె నటనటీ సుషిరాన్వితంబై శైలజా నిటలంబునుం

బోలెఁ జందనకర్పూర తిలకాలంకృతంబై వర్షాగమంబునుం బోలె నింద్రబాణాసన

మేఘకరక కమనీయంబై నిగమంబునుం బోలె గాయత్రీ విరాజితంబై మహాకావ్యంబునుం

బోలె సరస మృదులతాకలితంబై వినతానిలయంబునుం బోలె సుపర్ణరుచిరంబై యమరావతీ

పురంబునుం బోలె సుమనోలలితంబై కైటభోద్యోగంబునుం బోలె మధిమానితంబై పురు

షోత్తమ సేవనంబునుంబోలె నమృత ఫలదంబై ధనంజయ సమీకంబునుంబోలె

నభ్రంకషపరాగంబై వైకుంఠపురంబునుం బోలె హరిఖడ్గపుండరీకవిలసితంబై

నందఘోషంబునుం బోలెఁ గృష్ణసార సుందరంబై లంకానగరంబునుం బోలె రామ

మహిషీవంచకసమేతంబై సుగ్రీవ సైన్యంబునుం బోలె గజగవయ శరభశోభితంబై

నారాయణ స్థానంబునుం బోలె నీలకంఠ హంసకౌశిక భారద్వాజతిత్తిరిభాసురంబై

మహాభారతంబునుం బోలె నేకచక్ర బక కంక ధార్తరాష్ట్ర శకునినకుల సంచార

సమ్మిళితంబై సూర్యరథంబునుం బొలె నురుతర ప్రవాహంబై జలదకాల సంధ్యా

ముహుర్తంబునుం బోలె బహువితతజాతి సౌమనస్యంబై యొప్పు నైమిశంబను

శ్రీవిష్ణుక్షేత్రంబునందు శౌనకాది మహామునులు స్వర్గలోక గీయమానుండగు

హరిం జేరుకొఱకు సహస్రవర్షంబు లనుష్ఠానకాలంబుగాఁగల సత్రసంజ్ఞికంబైన

యాగంబు సేయుచుండి రందొక్కనాఁడు వారలు రేపకడ నిత్యనైమిత్తిక

హోమంబు లాచరించి సత్కృతుండై సుఖాసీనుండై యున్న సూతునిం జూచి - 37


శౌనకాది ఋషుల ప్రశ్న[మార్చు]

క.

ఆతాపసులిట్లనిరి వి

నీతున్ విజ్ఞానఫణితనిఖిల పురాణ

వ్రాతున్ నుతహరిగుణ సం

ఘాతున్ సూతున్ నితాంతకరుణోపేతున్. 38


మ.

సమతం దొల్లి పురాణపంక్తు లితిహాసశ్రేణులుం ధర్మశా

స్త్రములున్ నీవు పఠించి చెప్పితివి వేదవ్యాస ముఖ్యుల్ మునుల్

సుమతుల్ సూచిన వెన్ని యన్నియును దోఁచున్ నీమదిన్ దత్పృసా

దమునం జేసి యెఱుంగ నేర్తువు సమస్తంబున్ బుధేంద్రోత్తమా. 39


క.

గురువులు ప్రియశిష్యులకుం

బరమరహస్యములు దెలియఁబలుకుదు రచల

స్థిర కల్యాణం బెయ్యది

పురుషులకును నిశ్చయించి బోధింపు తగన్. 40


క.

మన్నాఁడవు చిరకాలము

గన్నాఁడవు పెక్కులైన గ్రంథార్థంబుల్

విన్నాఁడవు వినఁదగినవి

యున్నాఁడవు పెద్దలొద్ద నుత్తమగోష్ఠిన్. 41


చ.

అలసులు మందబుద్ధియుతు లల్పతరాయువు లుగ్రరోగ సం

కలితులు మందభాగ్యులు సుకర్మములెయ్యవి సేయఁజాలరీ

కలియుగమందు మానవులు గావున నెయ్యది సర్వసౌఖ్యమై

యలవడు నేమిటం బొడము నాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. 42


సీ.

ఎవ్వని యవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధియు సొరిదిఁజేయు

నెవ్వని శుభనామ మేప్రొద్దు నడువంగ సంసారబంధంబు సమసిపోవు

నెవ్వని చరితంబు హృదయంబుఁ జేర్చిన భయమొంది మృత్యువు పరువువెట్టు

నెవ్వని పదనది నేపారుజలములు సేవింప నైర్మల్యసిద్ధి గలుగుఁ

తే.

దపసులెవ్వని పాదంబుదగిలి శాంతి తెఱఁగు గాంచిరి వసుదేవదేవకులకు

నెవ్వఁ డుదయించెఁ దత్కథలెల్ల వినఁగ నిచ్చపుట్టెడు నెఱిఁగింపు మిద్ధచరిత. 43


క.

భూషణములు వాణికి నఘ

పేషణములు మృత్యుచిత్త భీషణములు హృ

త్తోషణములు గల్యాణ వి

శేషణములు హరిగుణోపచితభాషణముల్. 44


క.

కలిదోష నివారకమై

యలఘు యశుల్ వొగడునట్టి హరికథనము ని

ర్మలగతిఁ గోరెడు పురుషుఁడు

వెలయఁగ నెవ్వాఁడు దగిలి వినఁడు మహాత్మా! 45


ఆ.

అనఘ విను రసజ్ఞులై వినువారికి

మాటమాట కధికమధురమైన

యట్టి కృష్ణుకథన మాకర్ణనము సేయఁ

దలఁపుగలదు మాకుఁ దనివిలేదు. 46


మ.

వరగోవింద కథాసుధారస మహావర్షోరుధారా పరం

పరలంగాక బుధేంద్రచంద్ర! యితరోపాయానురక్తిం బ్రవి

స్తర దుర్దాంతదురంత దుస్సహజనుస్సంభావితానేక దు

స్తర గంభీరకఠోరకల్మష కనద్దావానలం బాఱునే. 47


సీ.

హరినామకథన దావానల జ్వాలలఁ గాలవే ఘోరాఘ కాననములు

వైకుంఠదర్శన వాయుసంఘంబుచేఁ దొలఁగవే బహు దుఃఖ తోయదములు

కమలనాభధ్యాన కంఠీరవంబుచేఁ గూలవే సంతాప కుంజరములు

నారాయణస్మరణ ప్రభాకరదీప్తిఁ దీఱవే షడ్వర్గ తిమిరతతులు

ఆ.

నళిననయన భక్తి నావచేఁగాక సంసారజలధి దాఁటి చనఁగరాదు

వేయనేల మాకు విష్ణుప్రభావంబు దెలుపవయ్య సూత! ధీసమేత! 48


వ.

మఱియు కపటమానవుండును గూఢుండునైన మాధవుండు రామసహితుండై

యతిమానుషంబులైన పరాక్రమంబులు సేసెనఁట వాని వివరింపుము. కలి యుగంబు

రాఁగలదని వైష్ణవక్షేత్రంబున దిర్ఘసత్రనిమిత్తంబున హరికథలు విన నెడగలిగి నిలిచితిమి

దైవ యోగంబున. 49


క.

జలరాశి దాఁటఁగోరెడి

కలము జనుల్ గర్ణధారుఁగాంచిన భంగిన్

గలిదోష హరణవాంఛా

కలితులమగు మేము నిన్నుఁగంటిమి సూతా! 50


క.

చారుతరధర్మరాశికి

భారకుఁడగు కృష్ణుఁ డాత్మపదమునకేగన్

భారకుఁడు లేక యెవ్వనిఁ

జేరెను ధర్మంబు బలుపుసెడి మునినాథా! 51




భాగవతము స్కందములు భాగవతము స్కందములు
భాగవతము - ప్రధమ స్కంధము | భాగవతము - ద్వితీయ స్కంధము | భాగవతము - తృతీయ స్కంధము | భాగవతము - చతుర్ధ స్కంధము | భాగవతము - పంచమ స్కంధము | భాగవతము - షష్ఠ స్కంధము | భాగవతము - సప్తమ స్కంధము | భాగవతము - అష్టమ స్కంధము | భాగవతము - నవమ స్కంధము | భాగవతము - దశమ స్కంధము | భాగవతము - ఏకాదశ స్కంధము | భాగవతము - ద్వాదశ స్కంధము