Jump to content

సుప్రసిద్ధుల జీవిత విశేషాలు/రఘుపతి వెంకటరత్నం నాయుడు

వికీసోర్స్ నుండి

మహామనీషి

రఘుపతి వెంకటరత్నం నాయుడు

బౌద్ధమతం బోధించిన దయాగుణం, క్రైస్తవ మతం బోధించిన సేవా పరాయణత్వం పుణికి పుచ్చుకొన్న మహనీయుడు ఆచార్య రఘుపతి వెంకట రత్నం నాయుడుగారు. విద్యావేత్తగా, సంఘ సంస్కర్తగా, పవిత్రతకు సంకేతంగా వెలిగిన నాయుడుగారు 'బ్రహ్మర్షి'గా సుప్రసిద్ధులు.

నాయుడుగారు 1862 అక్టోబరు 1వ తేదీన మచిలీపట్నంలో జన్మించారు. వారి తండ్రి రఘుపతి అప్పయ్య నాయుడుగారు, తాతగారైన వెంకటరత్నం గారు మద్రాసు సైన్యంలో అధికారులుగ పనిచేసినవారు. తల్లిగారైన శేషమ్మ విష్ణుభక్తురాలు. ఆమె సుగుణ సంపన్నురాలు. పవిత్రుడైన మానవుని కుల మతాలను గురించి పట్టించుకోరాదు అనే వారామె.

తండ్రి అప్పయ్య నాయుడు సుబేదారుగ పనిచేస్తూ చాలాకాలం ఉత్తర భారతంలో వుండేవారు. బాల్యం నుండి ఆ ప్రాంతంలో వున్నందున నాయుడుగారికి హిందీ, ఉర్దూ, పర్షియన్ భాషలలో చక్కని పరిచయం కల్గింది. తండ్రి అప్పయ్య నాయుడు గారికి హైదరాబాద్ బదిలీ కావటం వల్ల వెంకటరత్నంగారు చాదర్‌ఘాట్ లోని నిజాం ఉన్నత పాఠశాలలో చదువు సాగించారు. ఆ పాఠశాలలో సరోజిని నాయుడు తండ్రి అఘోరనాథ్ ఛటోపాధ్యాయ గారి వద్ద నాయుడుగారు శిష్యరికం చేశారు. మద్రాసు క్రైస్తవ కళాశాలలో డా. మిల్లర్ అంతేవాసిగ అధ్యయనం సాగించారు.

సంఘం ఆధ్యాత్మికంగా ముందంజ వేయాలని విశ్వసించిన నాయుడుగారు సూఫీ వేదాంతాన్ని, హిందూ క్రైస్తవ మత సిద్ధాంతాలను బాగా ఆకళించుకొన్నారు. అసాధారణమైన జ్ఞాపకశక్తి గల నాయుడుగారు ఆంధ్రాంగ్ల భాషలలో అనర్గళంగా ఉపన్యసించేవారు.

కందుకూరి వీరేశలింగం పంతులుగారి సాహచర్యం కారణంగా విధవా వివాహాలను బలపరచసాగారు. బ్రహ్మసమాజ సిద్ధాంతాల పట్ల శ్రద్ధాసక్తుల కారణంగా విశ్వైక మత ప్రచారానికి, మానవతా ప్రబొధానికి కంకణం కట్టుకొన్నారు.

1884లో బి.ఎ. మొదటి సంవత్సరం విద్యార్ధిగా వున్నపుడే శేషమాంబ గారిని వివాహం చేసుకున్నారు. 1889 లో ఆమె ఆడబిడ్డను ప్రసవించి మరణించారు. ఆమె మరణించిన తర్వాత నాయుడుగారు మరలా వివాహం చేసుకోలేదు. ఆనాటి నుండి హిందూ వితంతువుల మాదిరిగా వుండాలని సదా తెల్లని దుస్తులే ధరించేవారు. అందువల్లనే నాయుడుగారిని ' ఆంధ్ర దేశ శ్వేతాంబర ఋషి ' అనేవారు.

నాయుడుగారు ఏలూరు సి.యం.ఎస్. హైస్కూలులోను, రాజమండ్రి, బందరు పట్టణాలలోని హైస్కూళ్ళలోనూ ఉపాధ్యాయులుగా, ప్రధానోపాధ్యాయులుగా పని చేశారు. 1891 లో ఎం.ఎ. (ఆంగ్ల సాహిత్యం) పట్టభద్రులై కొంతకాలం మద్రాసు పచ్చియప్ప కాలేజీలో ఆంత్రోపాలజీ ఇంగ్లీషు ప్రొఫెసర్ గా పనిచేశారు.

1904 లో పిఠాపురం రాజావారి కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ స్వీకారం చేశారు. కళాశాలలో స్త్రీలకు, దళిత జాతుల విద్యార్థులకు ఉచితంగా విద్య నేర్పబడేది. 1911 లో మొట్టమొదటి సారి బాలికలను కళాశాలలో చేర్చి సహవిద్యకు మార్గదర్శకులైనవారు నాయుడుగారు.

1905 నుండి 1929 వరకు పి. ఆర్. కళాశాల ప్రిన్సిపాల్ గా నాయుడుగారు గొప్ప సేవలందించారు. మహారాణీగారు కళాశాలకు కావలసిన భవనాలకు లక్షలు విరాళం గాను, 35 ఎకరాల స్థలం క్రీడలకు గాను దానం చేశారు. కళాశాలలో వారికి గల సాన్నిహిత్యం గురించి చెబుతూ, " నా హృదయాన్ని అరంగుళం చీల్చి చూడండి. అక్కడ మీకు పిఠాపురం రాజా కళాశాల కనిపిస్తుంది." అన్నారు.

1925లో నాయుడుగారు మద్రాసు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులుగా నియమింపబడినారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ బిల్లును రూపొందించి శాసన మండలిచే ఆమోదింప చేసిన మహనీయులు వెంకట రత్నం నాయుడుగారు. 1927లో ఆంధ్ర విశ్వ విద్యాలయం మొదటి పట్ట ప్రదానోత్సవంలో నాయుడుగారిని గౌరవ డాక్టరేట్ పట్టముతో సత్కరించింది.

నాటి ఆంగ్ల ప్రభుత్వం నాయుడుగారిని దివాన్ బహదూర్, కైజర్-ఇ-హింద్, 'సర్' బిరుదాలతో గౌరవించింది.

ఆయన దయామయుడు. ఎందరో అనాథ బాల బాలికలను చేరదీసి వారికి విద్యాబుద్ధులు గరిపించారు. 1936లో ఒకే నెలలో బీద విద్యార్థులు చదువుకు 1500 రూపాయలు అందజేశారు.

నాయుడుగారు "పీపుల్స్ ఫ్రెండ్, ఫెలో వర్కర్స్" అను ఆంగ్ల పత్రికలకు సంపాదకత్వం వహించి సాంఘిక సమస్యల మీద ఉత్తేజకరమైన వ్యాసాలు వ్రాశాడు.

అస్పృశ్యతా నివారణ కోసం ఉద్యమాన్నే నిర్వహించారు. బ్రహ్మ సమాజ సిద్ధాంతాలలో ప్రముఖులైన కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తూ, వర్ణాంతర వివాహాలను జరిపించారు.

ఆనాడు ఆంధ్ర దేశంలో ప్రబలంగా వున్న ' వేశ్యావృత్తి ' నిర్మూలనకు గొప్పగా కృషి చేశారు. శుభ కార్యాలలో విధిగా ఏర్పాటు చేస్తూ వుండిన భోగము మేళములను అంతరింపజేశారు. కళావంతుల సంఘములను స్థాపించి వేశ్యావృత్తి నిషేధానికి ముమ్మరంగా కృషి చేశారు. వారి కృషి వల్లనే ప్రభుత్వం వేశ్యావృత్తిని నిషేధించే చట్టాన్ని అమలు పరచింది.

మద్య నిషేధ ఉద్యమం సాగించారు. 1923లో మద్రాసు రాష్ట్ర శాసన మండలి సభ్యులుగా వున్నపుడు మద్య నిషేధం బిల్లు ప్రవేశపెట్టనందుకు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.

నేటి జీవన విధానంలో సమాజంలోని ఇతర వ్యక్తుల కంటే ఉపాధ్యాయుడు ఎక్కువ చైతన్య వంతుడు కావాలని, ఉపాధ్యాయులు ' విమోచన సేన ' గా ఉద్యమించాలని ఉద్బోధించేవారు.

సాంఘిక పవిత్రతా సంఘం నెలకొల్పి ఆ సంఘ సభ్యులకు క్రింది నియమాలను విధించారు.

1) వేశ్యలు పాల్గొను సమావేశాలకు వెళ్ళరాదు. వారిని ప్రోత్సహించరాదు. అశ్లీలమైన పాటలను పాడటం, వినటం సాహిత్య పఠనం చేయరాదు. శారీరక, మానసిక పవిత్రత్వాన్ని పెంపొందించుటకు కృషి చేయాలి.

ఈ విధంగా యువతలో శీల సంపదను పెంపొందించుటకు కృషి చేశారు. తమ నెలసరి ఆదాయంలో సొంతఖర్చులకు అతి స్వల్పంగా వుంచుకొని బీద విద్యార్థులకు ఆర్ధిక సహాయం అందచేసేవారు. తమ గురుదేవులైన డా. మిల్లర్ పేర మద్రాసు విశ్వవిద్యాలయంలో ప్రతి ఏటా విజ్ఞాన ప్రచారానికి పదివేల రూపాయల నిధిని ఏర్పాటు చేశారు.

'అపర సోక్రటీసు' గా ఆంధ్ర ప్రజల మన్ననలందుకున్న రఘుపతి వెంకట రత్నం నాయుడుగారు సంపూర్ణ జీవితం గడిపి 1939 మే 26వ తేదీన దివంగతులయ్యారు.