పుట:హాస్యవల్లరి.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

255

ఒక మగపెళ్ళివారు, రాత్రి, బాజాలతో భోజనానికి బయల్దేరి, వెనుకాల ఆడంగులూ ముందు మొగంగులూ నడక నడుస్తూండగా, కాగడావాడు ఆడంగులదగ్గిరే ఆగిపోగా, మగవారిలో ఒకరైన

ప్రసాదరావు - ఒరేయి కాగడా! మాకు వెలుతురు లేదురా!

కా - వెనకాల ఆడంగులండి బాబూ!

ప్ర - సరే, ఏడిసినట్టేఉంది. ఇక్కడ మేం మాత్రం !

256

సన్యాసి - (ఇంటివారితో) పోనీ మీరన్నట్టు నేను కామమ్మ మొగుణ్ణి కాకపోతే నా కర్రాబుర్రా నాకు పారెయ్యండి! వెధవ గోలొచ్చిపడింది. వీళ్ళగోల మండిపోను.

ఒకస్త్రీ - ఏమిటి నాయనా! అన్నీ అయాయిరీ, ఇంకా పైపెచ్చు ఏముటోచికాకు పడతావు, ఏం రోగం? నీ చికాకు చిచ్చంటించా!

స - చికాకా చికాకున్నరా ! ప్రతీ ఊళ్ళోనూ ప్రతీకొంపలోనూ నాకు ఇల్లా అవుతూంటేను!

257

సుబ్బారాయుడు వనమయ్యగారికి ఉత్తరంరాసి పెడుతూండగా చిరంబరంగారు వచ్చి, చి - ఏముటోయ్ సుబ్బారాయుడూ! పెదిమిలు బిగపట్టావ్ కనుబొమ్మలు ముడెట్టావ్, కలం పట్టట్టావ్, సర్రుమనిపించేస్తున్నావ్, ఏమిటదీ?

సు - నీ కెందుకుపోవయ్యా! ఆయనేదో నాకాళ్ళుపట్టుగుంటే ఓ ఉత్తరం గోకిపెడుతున్నాను.

చి - అల్లా అయితే వనమయ్యా! నువ్వు వసుదేవుడంతటివాడవని ఇప్పటికి విశదం అయింది.

258

సుబ్బకవి - ఏమండీ లచ్చయ్యగారూ! ఈ మధ్య మీరు మెడ్రాసు వెళ్లి వొచ్చారటా!

ల - మరేనండి.

సు - వ్యవహారపు పని గావును.

ల - మరేనండి. కొన్నికృతులు చేశానుగా!

సు - ఆకృతులు అచ్చుకొట్టిద్దామనా?

ల - మరే.

సు - అయితే త్యాగరాయకృతులు చేసింది మీరేనా ఏమిటీ!

259

బేరగాడు - షాహుకారూ! తమలపాకులు మోదెల్లా!

షా - మూడణాలండి. ఏమాత్రం?

బే - వందెల్లా?

షా - ఏడుకాన్లు ఇవ్వండి.

బే - కానీకి ఏమాత్రం వస్తాయి?

షా - ఇంతేటండీ బేరం! పదీ!

బే - ఓ దమ్మిడీవి కట్టూ!

షా - కొన్నా వెల్లవయ్యా !

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

58

హాస్యవల్లరి