పుట:హాస్యవల్లరి.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బే - కొనందే, ఎల్లా వెళ్ళడం?

షా - ఊరికే అడగరాదూ నాలుగూ!

బే - నీ యిష్టం, పోనీ అల్లా అయినాసరే.

260

సీనయ్యా బాపయ్యా కాలవగట్టున పళ్ళు తోముకుంటూ కూర్చున్న సమయంలో, ఒక యానాదిమనిషి, అచ్చంగా సీనయ్య అప్పుడు కప్పుగున్న శాలువలాంటి శాలువే కప్పుగుని గట్టంట పోతూండగా,

సీ - ఏమే అమ్మీ! ఎల్లాకొన్నావ్? శాలువ?

యా - రొండన్న రండి బాబూ!

సీ - చూశావోయ్, బాపయ్యా, ఆడ పీనుగుల తెలివి తక్కువా? అదీ ఇదీ సరిగ్గా ఒకటేగదా, ఇది నేను అయితే అయిందని రూపాయిన్న రెట్టి పట్టుగొచ్చాను.

యా - బాబూ, చిత్తగించండి, తెలివితక్కువ ఏ పీనుగులదో! నేను నా శాలువ వేలంలో పదణాలిచ్చి పుచ్చుగున్నానండి.

261

సీతన్న తన క్లాసుమేష్టర్ని ఇంటిదగ్గిర కలుసుగుని,

సీ - మేష్టారండి! రోజూ పొద్దున్నే రొండుఘంటల పాటు పుస్తకాలు వస్త్రకాళితంకింద నూకేస్తే చాలదండీ? గొప్పవాడవడానికీ ?

మే - గంటేచాలు, పట్టుదలగా చేస్తేసరి.

సీ - నాకు పట్టుదలా ఉందండీ!

మే - ఏమన్నా పాతపాఠాలు చూస్తున్నావా?

సీ - అవన్నీ ఒచ్చునండి, చూడ్డం అవసరం లేదు.

మే - కొత్తవి ఏమన్నా చూస్తున్నావా?

సీ - అవి తెలియవండి. చూడ్డం లాభంలేదు.

మే - పోనీ కొంత కొంత తెలిసేవి చూస్తూంటే?

సీ - అల్లాంటివి ఉండవండీ. చూడ్డం దండగా! పైగా తీరా చూసిం తరవాత పూర్తిగా తెలిసిపోతే!

262

తండ్రి - ప్రభా! ఇల్లా రా. బళ్ళోకి వెళ్ళేవచ్చావా?

ప్ర - ఆ. ఆఖరుగంట మా మేష్టరు లేకపోతే, నాలుగో క్లాసుని పొమ్మన్నారు.

తం - ఏమేం అయినాయి పాఠాలు!

ప్ర - “కాంపోషన్” అయింది నాన్నా.

తం - దేన్ని గురించి?

ప్ర - "రైల్లో మూడోక్లాసు ప్రయాణం” గురించి.

ఆ పళాన్ని మాక్లాసు పిల్లలంతా ఏకరాతే.

తం - నువ్వు?

ప్ర - ఒక్క ముక్కలో రాసిచ్చేశాను నాన్నా.

తం - ఏమనీ?

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

59

హాస్యవల్లరి