పుట:హాస్యవల్లరి.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అ - పోయాడో, ఉన్నాడో! పనిలోఉండే కష్టాన్ని బట్టి, ఎప్పుడో, ఓనాడు వాడు ఎల్లానూ పోవలసినవాడేగదా అనుకుని, తమ ఊర్నించి వెళ్ళిపోడంతోటే పోయాడు అనేస్తూంటారు, జనం! కాని, మొన్నరాత్రి వాడితస్సగొయ్యా!

కాం - వాడోడూ! ఆ ఒంటిచక్రం సైకిల్‌వాడు, వాడు రొండోమాటొచ్చాడు. చూశావూ, వాడికాలు మడతకూడా పడిందీ!

అ - (మొఖం కొంచెం పొగచూరినట్టై) వాడా! నేనూ, అప్పుడూ, అవుటికి వచ్చాను. కాని, వాడు మూడోమాటు వచ్చాడేం, అప్పుడు ఒళ్ళుపులకరించి పోయిందిష్మీ! -

కాం - వాడు మూడోమాటు అసలు రాలేదు కాదురా!

అ - (చికాకు ఆపుగుంటూ) మూడోమాటు రాకపోవడమేమిట్రా? నిక్షేపరాయిడల్లావచ్చాడు. అప్పుడు నువ్వు అవుటికి వెళ్ళావేమో, జ్ఞాపకం చేసుకో!

కాం - కూచున్న చోట్నించి నేను కదల్లేదు, రెప్పవెయ్యలేదు, అవుటికి అనేమాట స్మరించలేదు.

అ - (వెళ్ళబోతూ) వస్తానుండు.

కాం - ఎక్కడికీ?

అ - అవుటికి. ఇతరులపన్లు నేను ఎన్ని చెయ్యటం లేదూ?

కాం - నువ్వుఅసలు వచ్చావా సర్కస్‌కీ?

అ - నేనా, బోలెడొచ్చాను. నేవచ్చినంత ఎవ్వడూరాలేదు.

కాం - వస్తే కోపమెందుకూ? వచ్చి మొత్తంగా అవుటి కెళ్ళావేమో జ్ఞాపకంచేసుగో?

ఆ - అది జ్ఞాపకంరాకనే, ఇప్పుడెడుతున్నానోయ్ అవుటికీ! ఇహ ఊరుకో, ఎల్లాగైతేం నేర్చావు సర్కస్ కబుర్లూ!

140

చిన్నప్ప - శేషాయిగారూ, ఈ మధ్య ఊళ్ళలేనట్టున్నారు!

శే - చిత్తం. సర్వమూ బ్లాక్‌మార్కెట్ కదండీ! అందుకని తిరగవలసొచ్చి తిరుగుతున్నాను. ఎక్కడా అనకండి, దక్కాలి గాని, చిలుం వొదిలింది.

చి - ఏమిటి గ్రంథం?

శే - మా కుర్రాడు పరీక్ష కెళ్ళాడు.

చి - దానికీ బ్లాక్ మార్కెట్ కీ సంబంధ మేమిటీ?

శే - అయ్యో మీ అజ్ఞానమా! పరీక్షపూర్వ ప్రశ్న పత్రాలు ఆర్జించేటప్పుడు; సమాధాన పత్రాలు రాస్తూండేటప్పుడు! రాసిం తరువాత అవి పోస్టులోనూ రైళ్ళలోనూ ప్రయాణించేటప్పుడు; అవి చిల్లరపరీక్షకుడు అధీనంలో ఉన్నప్పుడు? అవి టోకు ఆసామీని చేరుకున్నప్పుడు! వాటి వయినాలు ఖాయం కాబోయేటప్పుడు. ఇలాగ్గా పొడుగునా, చిన్నచిన్న పరీక్ష మొదలు మహా మహా పరీక్షల చివరదాకా బ్లాక్‌మార్కెట్.

చి - అదా! మనుషులుంటే మోసాలుంటాయి. మోసాలు ప్రతీదాల్లోనూ ఉండగలవ్. ఉంటేం? ఈ మోసాలకి మరోపేరు చూడండి. బ్లాక్‌మార్కెట్ అంటారేం?

శే - మరోపేరెందుకూ? మార్కెట్‌లో మార్కుల ప్రమేయం లేదా. బ్లాక్‌లో సిరాస్ఫురణలేదా?

141

ఒక భవనంలో జరుగుతూన్న సమావేశం గురించి వీధివెంటపోతూన్న ప్రసాదం, ద్వారందగ్గిర నిలబడ్డ ఒకావిడతో హేళనగా,

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

105

హాస్యవల్లరి