చ. |
మునివర యివ్విధంబున సముద్భవ మొందెఁ బృథుండు? ధాత్రి యే
యనువున దోహయోగ్య యగునట్లుగఁ దా నొనరించె? నెవ్వర
మ్మనుజవరేణ్యుపన్పున సమంచితవస్తువిశేషదోగ్ధలై
రనయముఁ జిత్ర మట్టితెఱఁ గంతయు నా కెఱిఁగింపు నావుడున్.
| 98
|
పృథుచక్రవర్తి భూమిని గోవుఁగాఁ జేసి వస్తువులు గొన్న ప్రకారము
వ. |
అతనికి వైశంపాయనుం డిట్లనియె.
| 99
|
సీ. |
ఆదియుగంబున నంగుండు నాఁ జను భూమీశ్వరుఁడు మృత్యుపుత్రియైన
నీరజనయన సునీథయం దధికబాహాసముద్ధతు వేనుఁ డనుతనూజుఁ
గనియె రాజై వాఁడు తనదుమాతామహుఁ బోలి క్రౌర్యంబునఁ బుడమిజనులఁ
బీడించి ధర్మంబుఁ బెడఁబాయఁగాఁ ద్రోచి వేదవిరుద్ధదుర్వృత్తి మరగి
|
|
తే. |
యెల్లవారలఁ బిలిచి మీ రేసుకృతము, నాచరింపఁగ వలదు మీ రధ్వరముల
తెరువు వోకుఁ డీమేర నతిక్రమింతు, రేని జంపుదుఁ జెఱుతు నెవ్వానినైన.
| 100
|
తే. |
యజన మిజ్యుండు యష్ట నా నతిశయిల్లు, నిన్ని తెఱఁగులవస్తువు లేన కాఁగఁ
దలఁపుఁ డేమేని కర్జంబు గలిగెనేనిఁ, [1]బన్నుగా నది చేయుఁడు నన్నుగుఱించి.
| 101
|
సీ. |
జపములు గాయత్రి సహితంబుగా [2]మాసె వేదంబు పేరును వినఁగ లేద
సోమపానక్రియచొప్పులు [3]రూపఱె హుతములు కఱవయ్యె హుతవహునకు
సర్వదైవతసమర్చలు గట్టిపెట్టంగఁ[4]బడిన భూతంబులపనులు సమసెఁ
బరహితంబులు దానపరతలుఁ గడతేఱె సతతవ్రతోపవాసములు పొలిసె
|
|
తే. |
[5]స్వామిచందంబు చందమౌ జనుల కనిన, మాట నిజముగ వేనక్షమాతలేశుఁ
డఖిలధర్మపరాఙ్ముఖుఁ డయిన నతని, మతము చెల్లించి రెందును మనుజకోటి.
| 103
|
వ. |
[6]ఆమెయికిఁ దలంకి తపస్వివరు లెల్ల నమ్మహీపాలుపాలికిం జనుదెంచి.
| 104
|
మ. |
జనసంత్రాసనవృత్తి, [7]జేయఁదగునే సత్కర్మ నిర్మూలనం
బొనరింప న్నృప నీకు నిట్లు విను మే మొప్పారఁ బెక్కబ్దముల్
[8]జనుయాగం బొనరింపఁజూచెదము విశ్వక్షోణికిన్ రాజ వీ
వనుకూలుండవు గమ్ము మాక్రియకు ధర్మాయత్తచిత్తంబునన్.
| 105
|
తే. |
క్షత్రియునిఁ దెచ్చి తొలితొలి గద్దియనిడి, పట్టబద్ధుఁ గావించుచోఁ బ్రజలు దమ్ముఁ
గావ ధర్మంబు నడపను గాదె సమయ, మర్థిఁ బలుకుదు రీ వది యరయవలదె.
| 106
|
- ↑ బన్నుగాఁ జేయుఁడీ మీరు నన్నుగుఱిచి
- ↑ మానె
- ↑ రూపేదె
- ↑ బడియె బూర్తంబుల (పూ. ము.)
- ↑ స్వామిచందంబు సేవకజనుల స్వామిచందంబె చందంబు; స్వామిభృత్యులచందంబు జనుల కనిన, మాట నిజము లేదయ్యె క్ష్మాతలేశు.
- ↑ అమ్మెయిఁ దలరి
- ↑ చేర్చఁదగునే
- ↑ విను యాగంబు దొడంగఁజూచెదము నీవీ (పూ. ము.)