పుట:హరివంశము.pdf/567

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 10.

519

సీ. ఆఱంగములు గలయైశ్వర్యమునకు నివాసమై యొప్పు నెవ్వానిమహిమ
     యెవ్వానియున్నచో టెఱిఁగినధన్యులు మగుడరు జన్మసమ్మర్దములకు
     నిందునందును మేలు నొందఁగోరెడువారు క్రతుమూర్తి నెవ్వానిఁ గని భజింతు
     రాకాశ మవ్య క్త మజర మనోమయం బానంద మమృత మెవ్వానితత్త్వ
తే. మమ్మహాత్ముఁ దపోమయు నాద్యు నచలు, నీశు విశ్వైకధుర్యు మహేంద్రుతమ్ముఁ
     జూచి రుత్ఫుల్లలోచనాంశువులతోడ, నర్థి నిచ్చలుఁ జనుదెంచి యమరవరులు.231
వ. ఒక్కనాఁ డవ్విష్ణుండు నిజదర్శనసమాగతు లైన యదితిసుతుల నందరం గరుణా
     తరంగితంబు లగు నాలోకనంబుల ననుగ్రహించి తదీయప్రయోజనంబు నెఱుం
     గనివాఁడ పోలె ని ట్లనియె.232
క. అలఘుమతులార మీ ర, స్థలితచరితు లతులధైర్యశౌర్యాదిగుణా
     జ్జ్వలులు విశేషించి మదీ, యులు మీ కొకయర్థసిద్ధి యొనరింతుఁ దగన్.233
క. ఎయ్యది ధర్మసమృద్ధం, బెయ్యది దుష్కరము లోకహిత మగుచందం
     బెయ్యది చెపుఁడా చేసెద, నయ్యుత్తమకార్య మెద్దియైనఁ గడంకన్.234
వ. అనినఁ బురుహూతు నగ్రభాగంబున నిడికొని యజ్ఞభాగభుజు లందఱు నయ్య
     మందప్రజ్ఞున కి ట్లనిరి.235

ఇంద్రాదిదేవతలు వామనుని బలిని నిర్జించి స్వారాజ్యంబు గొనం బ్రార్థించుట

సీ. బలి యనుదైత్యుండు పద్మసంభవుఁ దపోభరమున మెచ్చించి వరము వడసి
     శక్తి నెవ్వరికి దుస్సాధుఁడై మముఁ ద్రోచి యఖిలవైభవములు నపహరించెఁ
     జంపంగఁ జెఱుప నశక్తుల మాతని నీ వుపాయంబున లావు కలిమి
     నధికుఁడ వయశాలి వమితతేజుండ వేవిధమున నైన నవ్విమతు నొడిచి
తే. భవదుపాశ్రయైకవ్రతపరుల మైన, మాకు నొలసినయాపద మాన్పవలయు
     నొక్కఁడవు నిత్యకీర్తి వభ్యుదితవిశ్వ,గురుఁడ వగునినుఁ గడవఁగ నొరుఁడు గలఁడె.236
చ. అనిమిషనాయకుం ద్రిభువనాధిపుగా మును నీవ నిల్పి తా
     యన యిటు తత్పదచ్యుతి ననాకలితద్యుతియై నశింపఁగాఁ
     గనుఁగొన నీక కాదె వగఁ గశ్యపసంయమి తత్పురంధ్రి యా
     యనిమిషు లీఋషుల్ ప్రియము నందరె యింద్రుఁ బ్రతిష్ఠ చేసినన్.237
శా. లోకాతీతుఁడవయ్యు లోకములకున్ లోనై విహారేచ్ఛమై
     మాకుం జుట్టమ నంచుఁ బేరొకటి సన్మానించి యున్నాఁడ వి
     ట్లీకార్యం బొనరించి యిందఱఋణం బెల్లం దగ న్నీఁగు మ
     స్తోకస్తోత్రసహస్రపాత్ర మగుచున్ శోభిల్లు నీపేర్మియున్.238
వ. వైరోచనుం డిప్పుడు వాజిమేధమఖంబున దీక్షితుం డై యున్నవాఁడు దీనికిం
     దగిన వెరవునం గర్తవ్యంబు చింతనం బొనర్పు మనిన నుపేంద్రుండు తద్వచనం
     బులదెసం జిత్తంబు నిలిపి వారిం గనుంగొని.239