పుట:హరివంశము.pdf/566

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

518

హరివంశము

క. క్రవ్యాదులు దమయెఱచులు, క్రవ్యాదుల కిత్తు రాజిఁ గడుమోదమునన్
     గ్రవ్యాదులతోఁ గూడఁగ, హవ్యాదులు గాంతు రర్థి నాత్మపదంబుల్.222
వ. మీరు నిశ్చింతంబు లగు నంతరంగంబులతోడ నరుగుం డని యానతిచ్చిన మహా
     ప్రసాదం బని యందఱు నానందధ్వనులతో నభినందించి నమస్కరించి య య్యల
     క్షితమూర్తిచేత నామంత్రితు లైనవారై తమ మున్ను సనుదెంచిన మార్గంబున
     మగుడి చని దివిజులు కశ్యపమహాముని యాశ్రమంబునంద యుండి.223
తే. జలధరోదయ మర్థించుచాతకముల, భంగి విభున తారంబు వార్చియుండ
     నదితిదేవి యంతర్వత్నియై వహించెఁ, బ్రమదమునఁ జూలు దివ్యవర్షములువేయు.224
చ. హరి పరమేశ్వరేశ్వరుఁ డనంతుఁ డనంతగుణాశ్రయుండు పు
     ష్కరదళలోచనుండు గుణగణ్యుఁడు సర్వశరణ్యుఁ డిందిరా
     వరుఁడు వరప్రదుం డఖలవంద్యుఁడు గర్భమునంద యుండి య
     చ్చెరువుగ నిర్దహించె నవిజేయసురాహితశక్తు లన్నియున్.225
తే. తల్లికడుపున నెలకొని దనుజదమనుఁ, డొదవి తానును బొదలుచుఁ బొదలఁజేసె
     నిగమవైభవంబులు తపోనిలయములును, దివిజతేజంబులును గ్రతూద్దేశవిధులు.226
క. అమృతాశనులం గాంచిన, కమనీయోదరమునందుఁ గమలోదరు న
     య్యమితబలు నమృతుఁ దాల్చుట, నమృతాస్వాదినియ పోలె నదితి యెలర్చెన్.227
వ. ఇట్లు పరిపూర్ణగర్భిణి యైన కశ్యపగృహిణికిఁ బ్రసవసమయంబున సమధికతేజుం
     డగు తనూజుం డుదయించి పూర్వదిశాగర్భ ప్రసూతుం డైన సవితృ ననుకరించె
     నమ్మహాత్ము నుదయంబునఁ బ్రత్యాసన్ను లై మరీచ్యాదిబ్రహ్మలును భరద్వాజాది
     మునులును సనకాదియోగీంద్రులు ననేకశ్రుతిసూక్తంబులం బ్రస్తుతించిరి
     తుంబురు నారద పురస్సరంబుగా నఖలగంధర్వులు దివ్యగానంబులం గీర్తించిరి
     రంభాసమేతు లై యచ్చర లెల్ల నుల్లాసనృత్తంబులం గొలిచిరి వసురుద్రాదిత్యాశ్వి
     విశ్వేసాధ్యులు సిద్ధవిద్యాధరయక్షగుహ్యకశ్రేష్ఠులు విహంగభుజంగమప్రము
     ఖులుం బ్రమోదంబునం బ్రణామకలితు లగుచు వాగర్చనంబు లొనర్చిరి లోక
     పితామహుండు హంసవిమానంబుతోడ నేతెంచి యయ్యదితినందను నభినందించి
     యిక్కుమారుండు విశ్వస్తుతులకు నర్హుం డయ్యెం గావున విష్ణుం డనం బరఁగు
     నని నామధేయంబు నిరూపించి యభిరూపం బగు నుత్సవం బనుష్ఠించి యా సమస్త
     సురసంయమిసముదయంబులు ననుసరింప నాత్మీయసదనంబున కరిగె నంత.228
మ. ప్రతిపచ్చంద్రునిమాడ్కి నాతఁడు సమగ్రస్ఫూర్తితోవర్ధమా
     నత నొందంగ నవాంబువాహనిభమున్ సంపూర్ణచంద్రాస్యమున్
     సితపంకేరుహపత్రనేత్రముఁ బృథుశ్రీవత్సవక్షంబునై
     యతిరమ్యం బగు కుబ్జరూపమున నొప్పారెం బ్రభాప్రాంశుఁడై.229
క. వామనుఁడు బ్రహచర్య, శ్రీమహితుం డగుచు నుల్లసిల్లెఁ దగఁ దదీ
     యామితసౌందర్యము సుర, భామలచూపులకు నిచ్చపండుగు నిచ్చెన్.230