పుట:హరివంశము.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

హరివంశము

పూర్వభాగము - ప్రథమాశ్వాసము

శ్రీకిం బ్రేమపదంబు భూమికి నతిస్నిగ్ధుండు దుగ్ధాబ్ధిశ
య్యాకేళీరతుఁ డాదివేధకు గృహం బై యొప్పునాభిస్థనా
ళీకంబుం గలవేల్పు లోకములఁ బాలింపం బ్రభుం డుత్తమ
శ్లోకుం డన్నమవేమభూవిభున కిచ్చున్ సుస్థిరైశ్వర్యముల్.

1


శా.

శర్వాణీస్తనచక్రవాకములు వక్షస్స్ఫారకాసారమున్
గర్వం బింపెసలారఁగాఁ దఱిసి వేడ్క ల్సల్ప రోమాంచమున్
సర్వాంగీణముగా ధరించి[1]కొని యిచ్చన్ బేర్చు శంభుండు స
ర్వోర్వీరక్షణదక్షు వేమనృపు [2]నత్యూర్జస్వలుం జేయుతన్.

2


ఉ.

తమ్మికిఁ జూలి లోకములతాత తపస్వులయొజ్జ యోగివ
ర్గమ్ముల కాఢ్యుఁ డాగమపరంపరకుం బ్రభవంబు ధర్మభా
గమ్ములకర్త భారతికిఁ గాదిలి మువ్వురతొల్తపేరు ని
[3]త్యమ్ముగ నాయువీవుత [4]గుణాఢ్యుఁడు ప్రోలయవేమశౌరికిన్.

3


మ.

కమలాక్షస్మరఘస్మరాబ్జభవులున్ గైవారు లంభోధిపూ
రములున్ బుక్కిటిసాము గోత్రగిరివర్గంబున్ గనత్కందుకా
భము సంక్రీడనవేళ నేవిభున కాభవ్యుండు ప్రత్యూహసం
తమసాదిత్యుం డిభాననుం డొసఁగు భద్రంబుం గృతిస్వామికిన్.

4


మ.

వరవస్తుప్రతిపత్తిధుర్య మగునైశ్వర్యంబు పంచాశద
క్షరసంసిద్ధసమస్తశబ్దరచనాసంవ్యాప్తి నుద్దీప్తమై
పరఁగం గల్పలతాసధర్మ యగుచుం బ్రజ్ఞావిశేషాఢ్యులన్
గరుణం బ్రోచు సవిత్రి వాణిఁ ద్రిజగత్కల్యాణిఁ బ్రార్థించెదన్.

5


శా.

సందీప్తార్కసమప్రకాశు జలదశ్యామాంగుఁ గౢప్తాఖిల
చ్ఛందోబృందవిభాగుఁ బావనయశస్సందోహు [5]నస్పందధీ

  1. లలితేచ్ఛన్ బొల్చు శంభుం డశేషోర్వీరక్షణదక్షు వేమనృపు
  2. నిత్యోర్జస్వలున్ జేయుతన్
  3. మ్మగు
  4. కళాఢ్యుఁడు
  5. ఆస్పంద స, త్సందిష్టాంచిత