పుట:హరివంశము.pdf/485

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 8.

437

చ, మనతనుదీప్తు లన్నియును మాధద వేఱొకచందమై కన
     త్కనకసువర్ణతం దనరెఁ గాంచనశైలము నేఁడు జేరవ
     చ్చిన నిటు లయ్యెనో కడువిచిత్రము కారణ మొండు గల్గునో
     యనుపమబుద్ధి దీనితెఱఁ గారసి కర్జము చూడు మిత్తఱిన్.71
వ. అనవుఁడు నతం డిది బాణనగరసమీపంబు తద్రక్షణార్థంబు రుద్రాజ్ఞ నఖిల
     వహ్నులుం బరివేష్టించి యుండు నందులో నాహవనీయం బను వహ్ని మనకు
     నెదురై వచ్చినఁ దదీయద్యుతివలన నిట్టి వికారం బొలసె నిమ్మహాగ్ని యధికదుర్జ
     యంబు వినతాసుతుండు దీనికిఁ బ్రతినిధానం బెఱుంగు ననిన నాక్షణంబ యప్పక్షి
     వరుండు.72
చ. వెడలుపుగల్గునోరు లొకవేయి ధరించి వియన్నదీజలం
     బడరఁగఁ బుక్కిలించి రయమారఁగఁ దెచ్చి మహానలంబుపై
     నెడపడకుండఁ జల్ల నది యెంతొవెసం బొడవేది పోయె న
     ప్పుడు భుజగారి యద్భుతముఁ బొంది మదిం దనుఁదాన మెచ్చుచున్.73
మ. విపులజ్వాలలఁ గల్పసంక్షయదశన్ విశ్వంబు భస్మీకరిం
     చి పటుస్ఫూర్తి వెలుంగునట్టిది మహార్చిశ్చండ మివ్వహ్ని యి
     ట్లవధూతం బయిపోయెఁ గృష్ణుఁడును సీరాంకుండుఁ బ్రద్యుమ్నుఁడుం
     ద్రిపురారాతికి నైన నింక వెఱవం దెల్తుర్ త్రిలోకంబులన్.74
వ. అని తలంచుచుండ నన్నరకాంతకుండును నాగాంతకు విక్రాంతికి నత్యంతంబును
     సంతోషించి యతనిం బిచ్చలించె నవ్విధంబున నాహవనీయంబు ప్రశాంతం
     బయిన తెఱపిఁ బక్షిప్రభుండు భాసమాననిజపక్షపాతంబులం బ్రభూతం బగు
     నాతపంబు నుత్పాదించుచు నుత్పాతపతంగుపగిది నధికభీషణచక్షుఃప్రభాపరివేషం
     బుతో నట కడచిపోవ మఱియు రుద్రానుచరు లైన యగ్నులు బ్రహ్మపుత్రులు
     గుల్మాషుండును గుసుముండును దహనుండును శోషణుండును దపనుండు ననువా
     రేవురును బితరుండును బతంగుండును స్వర్ణుండును నౌర్వుండును భ్రాజుండు
     నన నేవురును రెండు మొత్తంబు లై నడచి.75
క. ఈవచ్చువాడు గరుడం, డీవీరునివీఁపుమీఁద నెవ్వరొ యుగ్రుల్
     మూవురు వెలిఁగెద రేమిటి, కై వచ్చెదరో మహాద్భుతాకారధరుల్.76
వ. మనము వీరిఁ బ్రతిహతులం జేయవలయు నని యెదిర్చి సింహగర్జితంబులంబోని
     యెలుంగుల శోణపురప్రాసాదరంధ్రంబులం బరఁగించిన నమ్మహాధ్వని విని బాణుం
     డవ్విధం బరయించి సర్వసైన్యంబుల సన్నద్ధంబులఁ గావించె నంత.77
సీ. ఘనులు జ్యోతిష్టోముఁడును విభావసుఁడునన్ వహ్ను లిద్దఱు రెండువలఁకులందుఁ
     దనకుఁ దోడై రా నుదగ్రతేజోమయం బగు రథం బెక్కి స్రువాయుధంబు
     దాల్చి యంగిరసుఁడు ధనువు లోనగు నస్త్రశస్త్రజాతము రథస్థంబు సేసి
     సన్నుతస్వాహావషట్కారవిభు లగు నాదశాగ్నులును మురారితోడ