పుట:హరివంశము.pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

352

హరివంశము

     కనఘా యొండువిచారముల్ వలదు తోయస్తంభముం జేయు మేఁ
     జనఁగా నెప్పటియట్లయై నిలువు నైజస్ఫూర్తి శోభిల్లఁగాన్.83
వ. అని యారత్నాకరు నొడంబఱిచి కడచి యుత్తరకురుభూముల నతిక్రమించి
     గంధమాదనశైలంబున కరుగునమ్మాధవుం గానవచ్చి జయంతంబు వైజయంతంబు
     నీలంబు శ్వేతంబు ఇంద్రకూటంబు కైలాసంబు ననుపర్వతంబు లాఱును మహా
     మేరువుం బురస్కరించికొని యనేకధాతుచిత్రితంబు లగునిజగాత్రంబు లుల్లసిల్ల
     నిలిచి పనియేమి యానతిచ్చి మముం బనుపు మనుటయుఁ బరమపురుషుండు.84
క. మద్రథవేగంబునకును, భద్రం బగుమార్గ మిచ్చి పాయుఁ డనిన న
     య్యద్రులు నొదుఁగుటయును నస, ముద్రగతిం జనియె ముదితమూర్తిఁబ్రభుండున్.85
తే. మేఘసంఘాతములలోన మిహిరమండ, లంబు సనుభంగిఁ బృథులశైలములనడుమఁ
     దగులువడ కేఁగువిష్ణురథంబు సూచి, మ్రొక్కి వినుతించె ననిమిషమునిగణములు.86
క. అటపోవఁ బోవఁగా వెలుఁ, గెటుపోయెనొ పోయెఁ బోయి యేపారెడు చీఁ
     కటిఁ జొరబడితిమి గడుసం, కట మగు పెనురొంపి సొచ్చుకరణి నరేంద్రా.87
తే. అవులఁ దాఁటిపోవనురాక యద్రికరణిఁ, గఠిన మై యాఁగె నపు డంధకారపటల
     మెంతయును భీతిఁ బొందితి నేను రథ్య, ములును రథ మీడ్వఁగా లేక ముచ్చముడిఁగె.88
క. అంత నసురమర్దియు దు, ర్దాంతసుదర్శనకరాళధారాహతి నా
     సంతమసమంతయును నిం, తింతలుతునియలుగ నడిచి యెడలించి వెసన్.89
క. చననిమ్ము రథం బని ననుఁ, బనుచుటయును గొంకు దేఱి పఱిపితిఁ దే రెం
     దును దాఁకుదగులు లే క, య్యనుపమహరు లద్భుతంబులై లీలఁ జనన్.90
వ. ఇట్లు కొలఁది కానరానిదవ్వు కొండొకవడి నరిగి యగ్రభాగంబున.91
చ. అలఘుసహస్రభానుతుహినాంశుకృశానులు వేనవేలుల
     క్షలు దమలోపలం గదిసి గట్టిగఁ బ్రోవయి యున్నచాడ్పునం
     జెలువయి దివ్యదృష్టులకుఁ జెందను జేరను రానియద్భుతో
     జ్జ్వలదురతిక్రమోగ్రవిభవం బగుతేజము గంటి మేర్పడన్.92
క. కన్నంతన గోవిందుఁడు, నన్నును బ్రాహ్మణునిఁ జూచి నవ్వుచు రథమున్
     గ్రన్నన డిగి చని చొచ్చె స, మున్నతతద్దీప్తికూటముం జోద్యముగాన్.93
క. ఎక్కడి వెలుఁ గిది యివ్విభుఁ, డొక్కఁడ యిట సొచ్చి నెట్లొకో తెఱఁ గనుచున్
     వెక్కసపడియెడుమా కతఁ, డొక్కముహూర్తమున మగుడ నొయ్యనఁ దోచెన్.94