పుట:హరివంశము.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

హరివంశము

ఉత్తరభాగము - చతుర్థాశ్వాసము

     మధ్యాంధ్రసందేశ
     క్షేమదకరవాల సుగుణకీర్తితగుణలో
     లా మంజులవాగ్జాలా
     వేమక్షితిపాల నిత్యవిజయ సుశీలా.[1]1
వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం [2]జెప్పె నివ్విధంబున బలభద్రు నుద్రేకం
     బాకర్ణించి యాపూర్ణవిస్మయస్తిమితమానసుం డై జనమేజయమేదినీశ్వరుండు
     వైశంపాయనమునివరున కి ట్లనియె.2
మ. జగతీచక్ర మశేషముం పృథుఫణాచక్రంబునం దాల్చి దై
     త్యగణోన్మర్దనుఁ డాజనార్దనుఁడు దానై మాననీయోన్నతిన్
     నిగమాంతస్తుతిఁ జేర్చు శేషుఁడు భువిన్ లీలాకృతిం దాల్చె నాఁ
     దగు నీలాంబరుపేర్మి యే వినుటకున్ ధన్యుండఁ బుణ్యవ్రతా.3
వ. ఇంకను నమ్మహాభాగుభాగధేయంబులు విన వేడ్క యయ్యెడు వివరింపు మనినఁ
     గృష్ణ ద్వైపాయన శిష్యుం డా విక్రమగుణవిశేష్యున కి ట్లనియె.4
క. బలమున నసదృశుఁ డగునా, బలదేవబలోదయప్రభావములు వచో
     బలశాలి యనఁగఁ బరఁగిన, బలరిపుగురునకును బొగడ భరము నరేంద్రా!5
వ. అయినను మదీయబుద్ధివాక్యప్రచారంబులకు గోచరంబు లైనవి వినిపించెద.6
తే. అఖిలరాజన్యసహితుఁ డై యరుగుదెంచి, యతనిఁ దొడరి జరాసంధునట్టి[3]జెట్టి
     ఘనగదారణమున నేమిగతి విహీనుఁ, డయ్యె నది మున్ను నీవిన్నయదియె కాదె.7
మ. పదివే లేనుఁగులంతలావున భువిం బ్రఖ్యాతుఁ డై నట్టిదో
     ర్మదనిర్ముద్రుఁడు భీముఁ డాతనికి సమ్యగ్విద్యలన్ శిష్యుఁ డై
     యుదితోత్సాహతఁ గౌతుకాహవములం దొక్కొక్కచో నయ్యశో
     విదితు న్మార్కొన నీడు గాఁడు [4]కడఁకన్ వేమార్లకుం బోరికిన్.8

  1. శ్రీపర్వతేశభక్తి, ఖ్యాపితగుణఘోడెరాయగంగగురుకృపా
    స్థాపిత సామ్రాజ్యసము, ద్దీపితవేమక్షితీంద్ర దీప్తదినేంద్రా.
  2. జెప్పినవిధంబున
  3. ధట్టి
  4. గదియ న్వేదండశౌర్యక్రియన్.