పుట:హరివంశము.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము ఆ. 3.

287

ఉ. నీవు దలంపఁగా గలుగు నిక్కము నేమముచొప్పుఁ సర్వ
     వావలికిం జతుర్యుగములందు భవత్పదనిత్యసత్యసం
     సేవనతత్పరప్రకృతి సేకొని యుండెడుమాదృశు ల్జగ
     త్పావన చోద్యమే కుశలభావమునం దనరారు టిమ్మెయిన్.25
తే. నిత్యశుద్ధబుద్ధానందనిర్మలస్వ, భావుఁడవు నీవు నారాక ప్రకటబుద్ధి
     నొలసె ననుట నాపైఁ గృపగలిమిమిగులఁ, జూచు టేఁ గృతార్థుఁడ నైతి సురశరణ్య.26
క. నీ చేప ట్టొకయించుక, గోచరముగఁ గంటిఁ గానఁ గొంకక యింకే
     నాచరితశుభవచఃపూ, జాచతురత మెఱసెదను బ్రసన్నుఁడ వగుమీ.27
వ. అని పలికి దేవముని దేవకీనందను వదనారవిందంబున నాదరంబునఁ జూడ్కి వెల
     యించి.28
శా. వీణావల్లిక సక్కఁ బూన్చి శ్రుతికన్వీతంబుగాఁ దంత్రులన్
     బ్రాణంబుల్ నెలకొల్పినట్లు మధురప్రారంభ[1]సంభూతితో
     రాణం బొయ్యనఁ దీర్చి మూర్ఛన మనోరాగంబు గావింప ని
     ర్వాణానందముఁ బట్టి చూపెడుగతిన్ వాయించె ధీయుక్తతన్.29
వ. అవ్వాద్యవిద్యాప్రయత్నంబుల యంతరంబులయందు.30
సీ. వేర్వేఱ గీతసంవృత్తబంధోదారబంధురోదాహృతిభంగి యలర
     మీనకూర్మవరాహమృగరిపువామనరామరాఘవజన్మరచన లోలిఁ
     బచరించి పదపడి బలభద్రకృష్ణాఖ్యభావముల్ రెండునుఁ బ్రస్తుతించి
     పూతనాశకటావఘాతంబు యమళార్జునాకృష్ణగోపాలనాతి సక్తి
తే. యురగదమనంబు గోవర్ధనోద్ధరణను, ధేనుకారిష్టకేశిమర్థన విభూతి
     కువలయాపీడమల్లసంక్షోభణమ్ము, కంసవిధ్వంసనము మేరగా నుతించె.31
క. అన్నిటియాభోగంబుల, నన్నీరజనాభు శ్రుతిసమారాధ్యయశున్
     [2]బెన్నిధిఁ బడసినవడువునఁ, జెన్నొందఁగఁ బాడె జనులచిత్తము లలరన్.32
తే. పిదపఁ జేతిదండియ యటువెట్టి కేలు, మొగిచి భక్తిరసం బాత్మ ముంచికొనంగ
     నఖిలవేదాంతవిద్యారహస్యభావుఁ, గోరి కీర్తించెఁ బ్రభువు నన్నారదుండు.33
వ. అమ్మహాగోష్ఠియందు గరిష్ఠుం డగుసురజ్యేష్ఠు నగ్రతనయు నగ్రిమవదనంబున
     నుద్గీతార్థసరస యగు సరస్వతివలన సరసీరుహాక్షుసాక్షాన్మహిమ లఖిలంబును విని
     యాదవు లద్భుతప్రమోదమేదురమానసు లై తమలో నియ్యఖిలేశ్వరునకుం
     జుట్టంబులము [3]బంటులము [4]ప్రసాదయోగ్యులము నై మన మింత కృతార్థుల
     మగుదుమె యిమ్మునిపుంగవుండు మన కింతకల్యాణం బొనర్చునె యిన్ని పోకలం
     బోయినవాఁ డింక వెన్నునియొద్ద నేమి చందంబు కోర్కి పడయం దలంచునో
     పాట యుడిగి మఱి యెవ్విధంబు సల్లాపంబునకుఁ దొడంగునో యని కౌతూహల
     చపలచిత్తు లగుచుండఁ గృష్ణుం డయ్యక్లిష్టచరితునిదెస భరితాదరుం డై.34

  1. సంభూరితా
  2. పెన్నిధి పడసిన
  3. బంధులము
  4. ప్రసాదహృదయులము