పుట:హరివంశము.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

286

హరివంశము

నారదుఁడు శ్రీకృష్ణునొద్దకు వచ్చి రుక్మిణీపరిణయోద్యమంబు తెఱం గెఱింగించుట

సీ. పసిఁడి కెంజాయ నింపెసలారుజడముడిఁ జెరివినమందారసురభికుసుమ
     మాలిక పైఁ గ్రాలులోలాళిపటలంబు పింఛాతపత్రంబు పేర్మిఁ దనకు
     నొసఁగఁ దెల్లనిమేని కుత్తరీయం బగుకడవసం బమృతాంశునొడలిమీఁది
     కందుచాడ్పునఁ దోఁపఁ గనకంపుమొలత్రాటఁ జెఱుఁగు దూఁగాడుచు సితపయోద
తే. చలితచంచలాగ్రముతోడి సరి యనంగఁ, జేతివీణ సన్నపుగాడ్పుపుచేత మ్రోయు
     తెఁఱగు లొయ్య మెచ్చుచుఁ జనుదెంచె గగన, మార్గమున నారదుఁడు కంసమథనుపురికి.16
క. చను దెంచి సర్వజనములుఁ, దనుఁ గౌతూహలతరంగతరళతరవిలో
     చను లై కనుఁగొనఁగ నగరి, యనుంగు మొగసాలగవని కవతీర్ణుం డై.17
వ. దౌవారికులచేతం దనరాక యెఱింగింప నింపారుసంభ్రమంబున నుగ్రసేనవసు
     దేవులు పురస్సరులుగా వాసుదేవుండు బలదేవసహితుం డై యదుముఖ్యులుఁ
     దోడరా నెదురువచ్చి నమస్కరించి యమ్మహాపురుషుం దోడ్కొనిపోయి సుధ
     ర్మాభ్యంతరంబున భర్మమయం బగు భవ్యపీఠంబున నునిచి యర్ఘ్యపాద్యాదివైదిక
     సత్కారంబు లాచరించి తదనుజ్ఞ నాసీనుం డై తక్కినవారిం గూర్చుండం బనిచి
     విరచితాంజలి యై యి ట్లనియె.18
శా. సేమంబే తగ నీకు లోకములకున్ సేమంబె [1]దేవాళికిన్
     సేముంబే మునిముఖ్య యెల్లకడల న్నిత్యస్వతంత్రుండ వై
     యీమాడ్కి న్విహరించునీయెఱుక [2]కన్వీతార్థముల్ గాని వె
     ట్లేమై వస్తువు లుగ్గడింపఁ గలవే యిమ్మూడులోకంబులన్.19
వ. అది యట్లుండె నిప్పుడు.20
క. నీకుశలం బే నడిగెద, నాకుశలత యెట్టిదో సనాతనయోగ
     శ్రీకుశలి యైనధన్యున, కేకుశలము గొఱుఁత యింత యెఱుఁగన కంటే.21
క. ఒక్కటి గల దీయదుకుల, మెక్కటి లోకమున లెక్క కెక్కఁగఁ జేయన్
     నిక్కముగ వచ్చి తీపని, దక్కఁగ నీరాక కొండు దగు నన నేదీ.22
     ధన్యులమైతి నిజధర్మములందు గృహీతనిత్యసౌ
     జన్యుల మైతి మభ్యుదయశాశ్వతపూజ్యత మై యలోకసా
     మాన్యుల మైతి మిట్లఖిలమాన్యమహావ్రతశాలి వీవు ధీ
     విన్యసనంబు మావలన విప్పుగఁ జేర్చుట[3]ఁ జేసి సంయమీ.23
క. అని యివి మొదలుగ మాధవుఁ, డనుపమమధురోక్తివిధము లభినవములుగా
     నొనరింపఁగ ముని యాతనిఁ, గనుఁగొని యి ట్లనియె వదనకమలం బలరన్.24

  1. నీవీణకున్
  2. కు న్వీతార్థముల్
  3. సంయమీశ్వరా