పుట:హరివంశము.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 2.

279

వ. తదనంతరంబ.151
సీ. కల్యాణదినమునఁ గమలాయతాక్షుండు బలదేవుఁ డాదిగాఁ గలుగు సర్వ
     యాదవులను గూర్చి యవ్వసుదేవోగ్రసేనులతోఁ గూడ మాననీయ
     భూసురప్రతతిచేఁ బుణ్యాహవాచనం బొనరింపఁ బంచి నెమ్మన మెలర్ప
     నందఱుఁ దోడరా నమ్మహాదుర్గమదేశ మంతయుఁ దగఁ దిరిగి చూచి
తే. నిర్ణయించి వారలతోడ నెమ్మి యెసఁగ, నిట్టు లను నే నొనర్చెద [1]నిచటఁ బురము
     మీరు దగియెడునెలవులు మెచ్చుగాఁగఁ, గైకొనుం డిష్టమందిరకరణమునకు.152
వ. ఏ నిప్పురంబునకు ద్వారవతి యను నామం బొనర్చితి నిప్పురికిం దగ నాలుగు
     వాకిళ్లును సోమవహ్నివరుణేంద్రదైవతంబులు నతివిస్తీర్ణంబులు రాజమార్గ
     సమ్ముఖంబులు గావలయు బ్రహవిష్ణుశంకర ప్రముఖదేవతాగారంబులుం జైత్యం
     బులం బ్రపలు రమ్యంబులుగా రచియించవలయు రాజమందిరం బతిమనోహరం
     బై యుండవలయు నని పలికి శిల్పాచార్యులం గర్మకరులను రావించి యివ్విధంబు
     నిఖిలంబు నాజ్ఞాపించిన.153
చ. అనుపమసర్వసాధనసమగ్రతతో శుభవేళ వాస్తుపూ
     జనబలిహోమతంత్రములు సద్విధిఁ జేయఁగ సూత్రహస్తు లై
     మునుకొని కోవిదస్థపతిముఖ్యులు శిల్పము లుద్యమింప న
     ప్పని [2]తనవేగిరంపుఁబ్రియభావనకుం దగి యుండకుండినన్.154
క. వెలివెడలనిజను లిటు దమ, నెలవు లుడిగి వచ్చి యిచట నిగ్రహపడఁగాఁ
     దలఁపునకు మున్న యిండ్లున్, దలకొనఁగా వలదె యనుచుఁ దలపోసి తగన్.155

శ్రీకృష్ణుఁడు విశ్వకర్మను రావించి ద్వారవతియనుపురంబు నిర్మింపం బనుచుట

క. ఏకాగ్రచిత్తుఁ డై హరి, యాకమలోద్భవతనూజు నద్భుతవిజ్ఞా
     నాకల్పు విశ్వకర్మఁ ద్రి, లోకీనుతు సుజనభజనలోలుఁ దలంచెన్.156
ఆ. తలఁపునకుఁ బ్రియంబు దనబుద్ధి [3]నెలకొన, నాక్షణంబ పంకజాక్షుపాలి
     కరుగుదెంచి వినయ మలరార నిట్లని, దివిజశిల్పి పలికె దియ్య మెసఁగ.157
మ. నిను నుద్దామకుతూహలోత్తరునిఁగా నిక్కం బెదం గాంచి చ
     య్యనఁ బుత్తెంచెఁ బురందరుం డధిప నాకద్వతాధీశ్వరుం
     డును విశ్వేశ్వరుఁ డైనఫాలనయనుండున్ భక్తి నేభంగి న
     ర్చనకుం బాత్రము లీవు నట్టుల కదా సంభావనాయుక్తికిన్.158
వ. ఎయ్యది కర్తవ్యం బానతి యిచ్చి పనుపు మనిన నవ్వాక్యం బభినందించి దేవకీ
     నందనుం డతని నత్యాదరంబున నాలోకించి.159
చ. సురలకుఁ గల్పభూరుహము చొప్పునఁ గోరినకోర్కు లన్నియుం
     గురియుదు వీవు నీతప మగోచర మిట్టి దనంగ నీకు నె

  1. నీపురంబు
  2. గని
  3. కెలయంగ