పుట:హరివంశము.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

270

హరివంశము

వ. ఇత్తెఱంగున నాశ్రితశ్రీవిధాయి యైన యాశ్రీవిభుండు విజయశ్రీసమేతుం డై
     సుఖంబున నుండె నయ్యదువీరు లిద్దఱు నమ్మహాసమరంబుల నాత్మీయదేవతా
     రూపంబులం దక్కినయప్పుడు మానుషాకారంబులుం బచరించి నిజమాయా
     ప్రభావంబు భావింప నెవ్వరికి నలవిగాక యతిశయిల్లుదు రంత నొక్కసమయం
     బున బలదేవుండు.72
క. తమపిన్ననాఁటియాటల, క్రమమంతయుఁ దలఁచి వేడ్క గడలుకొనఁగఁ జి
     త్తమునందు గోకులాలో, కమహోత్సవ మిచ్చగించి కర మిష్టమునన్.73
మ. జలజాతేక్షణుతోడఁ జెప్పి తదనుజ్ఞం దానొకండు సము
     జ్జ్వలకాంతారవిహారయోగ్య మగువేషం బొప్ప వ్రేపల్లెకున్
     లలిమై నేఁగినఁ దన్నివాసులు మహోల్లాసాత్ములై యమ్మహా
     బలు నంతంత నెదుర్కొనంగ నతఁడున్ బంధుత్వధౌరేయతన్.74
క. కొందఱకు మ్రొక్కి తనకుం, గొందఱు మ్రొక్కంగ వరుసఁ గొందఱుఁ గుశలం
     బందంద యడిగి కౌఁగిటఁ, గొందఱఁ గదియించి ప్రణయకోవిదుఁ డగుచున్.75
క. [1]గోపికలు పొదివికొనఁగాఁ, దీపారెడిచూడ్కితోడితిన్ననియుచితా
     లాపములఁ బ్రియము సలుపుచు, నాపోవని యింపుసొంపు లభినవములుగన్.76
వ. ఉన్నంత [2]గోపవృద్ధు లందఱు నతనిఁ బరివేష్టించి యిష్టగోష్ఠిం దగిలి యి ట్లనిరి.77
క. స్వాగతమే యాదవకుల, రాగవివర్ధన మహాత్మ రామ సుఖశ్రీ
     భాగి నిను నిపుడు గని సుఖ, భాగుల మే మైతి మెట్టిభాగ్యోదయమో.78
చ. తమతమ జన్మదేశముల తద్దయు రమ్యము లెల్లప్రాణిజా
     తములకు నంట యిప్పుడు గదా నిజ మయ్యె జగత్ప్రసిద్ధవి
     క్రముఁడవు నీవు నీపసులఁ గాచినచోటికి వచ్చి యిమ్మెయిన్
     మముఁ గొనియాడ నింకఁ గడుమాన్యుల మైతిమి దేవతాలికిన్.79
సీ. చెనఁటిచాణూరముష్టికుల భంజించుట [3]కంసవిధ్వంసనకఠినలీలఁ
     దనరుట శత్రునితండ్రిం బ్రతిష్ఠించు టబ్ధిలోఁ దిమితోడియాహవంబు
     గోమంతనగమున శ్రీ మెఱయంగ నుదాత్తదివ్యాయుధావాప్తిమహిమ
     భూమీశ్వరులతోడి భూరిసంగ్రామంబు కరవీరవిభుని సృగాలుఁ గూల్చు
తే. టర్థి మధుర కేతెంచుట యచటఁ జిత్ర, జయము గ్రమ్మఱఁ గొనుట యీసరణి నీవు
     దమ్ముఁడును జరించిన యద్భుతంపుఁజరిత, మెన్నఁ గొనియాడ నెవ్వర మిప్పు డేము.80
క. ఈవసుమతి యంతయు నిటు, మీవలనఁ బ్రతిష్ఠవడసె మీవా రగువా
     రేవారు వారు కల్యా, ణావాసులు [4]దార యగుట యరిదియె యనఘా.81

  1. గోపిక లొదవికొనంగా
  2. ఘోషవృద్ధు
  3. కంసునిఁ బరిమార్చి కరి నడంచి
  4. వార