పుట:హరివంశము.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 2.

271

చ. అన విని రాముఁ డి ట్లనియె నక్కటయిం తన నేల మీరు గూ
     ర్మి నెఱయఁ బెంపఁగాఁ బెరిఁగి మీచిరశిక్షఁ జరించి మీగృహం
     బున సరసాన్నము ల్గుడిచి బుద్ధిఁ దనర్చినమాకు నెందు శో
     భన మగు టేమి సందీయము బాంధవు లెవ్వరు మిమ్ముఁ బోలఁగన్.82
క. రాచసిరి యుండియును మది, యాచవికిం జొరదు నాకు హరికి నిచటిబా
     ల్యాచరణముపై మక్కువ, యేచందంబులను మఱవ నెన్నఁడు రామిన్.83
వ. అన సంతసిల్లి వారందఱు నతని నభినందించి మాధుర్యహృద్యంబు లగు మద్యం
     బులును సమధికాపేక్ష్యంబు లగు భక్ష్యంబులును భావానురూపంబు లగు నను
     లేపంబులును తేజోవిలాసకల్యాణంబు లగు మాల్యంబులును ననేకంబు లాకల్యాణ
     మూర్తికి సమర్పించినం బ్రీతుం డై వివిక్తంబును రమణీయంబు నగు ప్రదేశంబున.84
ఉ. గోపిక లందియీఁ బసిఁడికోర నుదారసుగంధిశీధు వి
     చ్ఛాపరిపూర్తిగాఁ గొని వెసం గడు నుగ్గడువై [1]ముదంబు సం
     వ్యాపకభంగి నంగము సమస్తము ఘూర్ణన మొందఁ జేయ ను
     ద్దీపిత మైనమోహము మదిం బరతంత్రత యావహింపఁగన్.85
సీ. కనకపుమ్రోకునఁ దనరెడు సురదంతిమాడ్కి నుత్ఫుల్లదామమున నమరి
     నిండువెన్నెల పర్వ నెఱయు కైలాసాద్రిలీలఁ జందనసాంద్రలిప్తి మెఱసి
     చలదుల్క మగుశరజ్జలదంబు క్రియ నేకకుండలమణిదీప్తిఁ గొమరు మిగిలి
     ఘనభోగియుక్తమై తనరుపటీరంబుగతిఁ జేతిహలమున నతిశయిల్లి
తే. దారకలలోఁ గలంకవిస్ఫారుఁ డగుచు, నలరుపూర్ణేందువిధమున నతివపిండు
     నడుమ నీలాంబరద్యుతి బెడఁగు గాఁగ, నధికధవళాంగరుచి నొప్పె నవ్విభుండు.86
వ. అచ్చటికి ననతిదూరగామిని యైన కాళిందిదిక్కు మొగం బై.87
క. ఓయమునానది నీయం, దాయతముగ నాకు వలయు నవగాహంబున్
     జేయఁగ [2]రావో తేవో, తోయము లని పిలిచె నెలుఁగు తొట్రిలఁ బెలుచన్.88
వ. పిలిచి యమ్మహాతరంగిణి యాత్మస్వభావంబునన యున్న యునికి దన్నుఁ గైకొన
     మిగాఁ గొని యమ్మహాబాహుండు.89

బలరామదేవుండు కాళిందీభేదనంబు సేయుట

మ. అలుకం బేర్చి హలం బధోముఖముగా నచ్చోటికిం జాఁచి త
     త్సలిలౌఘం బొకవ్రంతయై తనకునై సర్వంబు నొండొండ యి
     మ్ముల రావింపఁ దొడంగె భూరిభయసమ్మోహంబునన్ ధాత్రి య
     గ్గలపుంగంపము నొందఁ గ్రిందటిభుజంగవ్రాతముల్ భీతిలన్.90

  1. మదంబు
  2. వేగమ రావో