పుట:హరివంశము.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 2.

269

తే. అలుక యంతంత కెక్కఁగ హలధరుండు, విమతుఁ బొరిగొందు నింకొక్కవ్రేటు వ్రేసి
     యని తలంచుచుఁ బెనుగద హస్తతలము, నం దమర్చి యుగ్రపుదృష్టి నతనిఁ జూడ.65
వ. అంతరిక్షంబున నశరీరవాణి యి ట్లను నీమాగధుం డొరులచేతం జావఁడు వీని
     మృత్యువు వేఱొక్కరుం డున్నవాఁ డనతిచిరం బగు కాలంబున నవ్విధంబు
     సంపన్నంబయ్యెడు నీ విప్పు డాయాసంబుఁ బొంద వలవ దుడుగు మనిన విని
     జరాసంధుండు విమనస్కుం డయ్యె. రాముండును సంగ్రామవిరామంబు నొందె
     నారెండు దెఱంగులవారును నంత బో రుడిగి తిరిగిపోయిరి యాదవులు మరి
     యునుం బ్రతిదినంబును సన్నద్ధు లై వెడలుమాగధులును సకలపార్థివసేనలతోడం
     గూడి దొడరి పెనంగుదు రిట్టిక్రమంబున దీర్ఘకాలంబ యితరేతరక్షయకారి
     యగు దారుణసంప్రహారంబు సెల్లుచుండ.66

జరాసంధుండు పరాజయంబు నొంది మరలి నిజపురంబునకుం జనుట

చ. అనుపమ దైవమానుషబలాధికు లాయదువంశసంప్రవ
     ర్ధనులభుజ[1]ప్రభావపటుదర్పము లార్పఁగ రామి తెల్లఁగాఁ
     గని పగతుండు గం డడఁగి కాతరభావము నెమ్మనంబునం
     దనికిన సర్వయత్నములు దక్కి నృపాలసముత్కరంబుతోన్.67
వ. సేనాసముదయంబుల నెల్ల [2]దివియించుకొని నిస్తేజుం డై తనవచ్చినత్రోవన
     మగిడె నప్పగిది మగధపతి బెగడి తొలంగి పోయిన.68
మ. విజయభ్రాజితు లై యదుప్రవరు లావిర్భూతసమ్మోదసం
     ప్రజయస్వాంతత నచ్యుతున్ హలధరున్ భవ్యోక్తిఁ గీర్తించుచు
     న్నిజభాగ్యోదయ మెల్లవారలును వర్ణింపంగఁ బూర్ణోన్నతిం
     ద్రిజగద్రాజ్యము సేరినట్లు కడు నుద్దీపించి.69
ఉ. అందును బుద్ధియుక్త మగు యాదవవృద్ధగణ
     స్పందయశోధికప్రకటభంగుల గెల్చియు గెల్పు [3]గెల్పుగా
     డెందములందు సూడక కడిందిగ స్రుక్కియ యుండెఁ బెంపుసొం
     పుం దనరార వానిబలముం జలమున్ గుఱిగా వెలుంగుటన్.70
సీ. అట్లు పలాయితుం డై చని యాజరాసంధుఁ డే మని చెప్పఁ జలము [4]మిగులఁ
     దక్కక మఱియు నుద్దండత నెప్పటియట్లు మధురపయి నరుగుదెంచె
     యాదవులును దొంటియట్టుల సమకట్టి వెడలి ఖేచరదృష్టి వెక్కసమున
     మునుఁగంగఁ బోరి రిట్టెనసినపోరాట పదునెనిమిదిమాఱు లెదిరి రిపుఁడు
తే. భగ్నుఁడై పోయె నయ్యదుపతియుఁ దాను, శక్తుఁ డయ్యును బ్రతిపక్షుఁ జంపనొల్లఁ
     డొరుఁడు వానికి మృత్యువై యునికి బుద్ధి, నింతయు [5]సునిశ్చితమ్ముగ నెఱుఁగుఁ గాన.71

  1. ప్రభావములు
  2. నవియించు
  3. పాడిగా
  4. మిగిలి
  5. సువిశ్చితమ్ముగ