పుట:హరివంశము.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

262

హరివంశము

     జాలంగ నెందును సవరించు టమ్ములఁ దోమరంబులను శక్తులను గదల
     గగనంబు నీరంధ్రకంబుగాఁ బొదవి యం దెవ్వరిఁ దలసూపనీకయుండు
తే. టోలి కర్జంబుగా నెల్ల యోధులకును, జెప్పి నేఁడాదిగఁ బుగంబు సెఱుచుపనియ
     సర్వకృతియు మీ కని సమాజ్ఞాపనం బొ, నర్చి మఱియు నానగరము నాల్గుదెసల.16
వ. గోమంతపర్వతంబున నెవ్వరి నేదిక్కున నిలువ నియమించె నట్లు వారి నయ్యై
     విధంబులను నిలిపి లగ్గసేయం దొడంగిన.17
తే. ఉగ్రసేనాసమేతుఁడై యుగ్రసేను, నగ్రసరుఁగా నొనర్చి వీరాగ్రగణ్యుఁ
     డచ్యుతుఁడు బలదేవసమన్వితముగ, నఖిలయదువర్గములఁ గొని యనికి వెడలె.18
చ. వెలలిన యాదవేంద్రు నతివిశ్రుతతేజునిఁ గాంచి భూమి భృ
     ద్బలములు భీతివిహ్వలవిభావనఁ జేష్ట లడంగి చిత్రితం
     బులక్రియఁ జూచుచుండె నరపుంగవకోటియుఁ జిత్తము ల్గడుం
     గలఁగఁగ డొంకె నంత భుజగర్వము సర్వము దక్కి గ్రక్కునన్.19
క. తమ మొనలు గరము గొంచెము, లమేయములు వగఱమూఁక లని యేమియు ను
     ల్లముల గణింపక యాదవ, సమితియు వెస గడఁగెఁ జక్రిశౌర్యము గలిమిన్.20
వ. అయ్యవసరంబున.21
చ. గరుడపతాకతోడిరథకల్పన మొప్పగఁ జక్రమాదిగాఁ
     బరఁగిన కైదువు ల్వితతబాహువులన్ వెలుఁగొంద దివ్యతా
     స్ఫురితశరీరుఁడై సకలభూతభయంకరవిక్రముండు పం
     కరుహదళేక్షణుం డడరెఁ గంపముఁ బొందఁగ శత్రుసైన్యముల్.22
క. హలముసలచాపధరుఁ డై, బలుఁడును నిజదివ్యమూర్తి భాసిల్లఁ గడున్
     వెలుఁగొంద రిఫులచూడ్కులు, ప్రళయవిభావసునిఁ గనినపరుసున మెఱయన్.23
వ. ఇట్లు సన్నద్ధు లై వసుదేవసూనులు సర్వసైన్యంబులం దలకడచి మహామకరం
     బులు మకరాలయంబు దఱియు తెఱంగున విరోధివ్యూహంబు గలంగఁ దఱిసి
     రప్పుడు కృష్ణు నంతంతం గని సేనాగ్రగామి యగు జరాసంధుండు నిజశంఖంబు
     పూరించిన వారిజోదరుం డయ్యుత్సాహంబు సరకు నేయక పాంచజన్యనినాదం
     బున భూదిగ్గగనమధ్యంబు సంభరితంబు గావించిన.24
తే. ఊర్ధ్వలోకనివాసుల యుల్లములును, నధికభయమోహవివశంబు లయ్యె ననిన
     నల్ప ధారుణీనాథసైన్యములు గలఁగి, త్రిప్పుకొని తల్లడిల్లుట సెప్ప నేల.25

జరాసంధుఁ డుగ్రసేను నెదుర్కొని రూక్షాక్షరంబుగ నాక్షేపించుట

వ. అమ్మహాయోధవరులం దాఁకి మగధనాథుం డనేకబాణపరంపరలు పరఁగించుచుం
     గదిసి తదీయపార్శ్వంబున వరరథంబునం దున్న యుగ్రసేనునిం గని యి ట్లనియె.26