పుట:హరివంశము.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 4

91


వ.

మఱియు నాత్మీయదారహరణదురితాపరాధి యైనవాని నహీనతపోవిభవలబ్ధ
ప్రభావు దేవాసురయక్షరక్షోభుజగగంధ్వరాదిసకలభూతదుర్జయు నపరిమితదనుజ
కోటిసహస్రపరివారు దారుణబాహువీర్యసమగ్రు దశగ్రీవు నుగ్రసమరంబున
సమయించె నివి యమ్మహాత్ముని విక్రమంబులు తదీయానుజు లగులక్ష్మణాదు
లింద్రజిల్లవణాదిసురవిరోధుల వధియించి రిట్టిమహిమచేత నత్యంతమహితుం డై
యతం డయోధ్యాపురంబున నభిషేకంబు నొంది దశాశ్వమేథావబృథస్నానశిర
స్కుం డై మహాతపస్వు లగుభూసురులకు గోసువర్ణగజరథతురగగ్రామకన్యా
దాసదాసీగృహాదిదానంబులవలన నతిసమృద్ధి గావించి సమ్యక్ప్రజాకల్పనంబునం
బరమధర్మంబు వడసె నాతని రాజ్యంబునందు.

65


సీ.

విషశస్త్రజలవహ్నివిమతతస్కరబాధ లొంద వెన్నఁడు భర్త లువిదలందు
సతివలు పతులందు నవిలంఘితాచార లమరువర్ణంబులు నాశ్రమములు
నాత్మీయధర్మమునం దనాలస్యతఁ దనరారుఁ బ్రాణిజాతముల కెల్ల
నొలయ దకాలమృత్యుభయంబు దెవుళులు కలఁకలు [1]కఱవులు గలుగ వెపుడు


తే.

నఖిలజనులు [2]సహస్రవర్షాయుషులు స, హస్ర[3]సంతానయుతులు సహస్రవిధులు
నగుచు [4]మోదింతు రచట లే వకృతదంభ, దర్పకార్పణ్యలోభాద్యధర్మగతులు.

66


క.

మునులును సురలును వేడుక, మనుజులలోఁ గలసి మెలసి మనుచుండుదు రెం
దును గుడువుఁడు గట్టుఁడు గొనుఁ, డనుమాటలు వినఁగవచ్చు నఖలక్షోణిన్.

67


క.

పదివేలును బదినూఱులు, నొదవిన లెక్క యగు నేఁడు లుర్వీస్ధలిపై
ద్రిదశహితార్థముగ నిలిచి, పదపడి రఘువిభుఁడు నిత్యపదవిం బొందెన్.

68


వ.

రామావతారానంతరం బనంతవిభవుం డగులక్ష్మీవిభుండు యాదవరామత్వం
బులు గృష్ణత్వంబు నొందె నందుఁ బ్రలంబముష్టికమైందద్వివిదవధంబును నరిష్ట
కేశికువలయాపీడచాణూరకంసధ్వంసనంబును మురనరకశిశుపాలకాలయవనసాల్వ
పౌండ్రహననంబును బాణపరాభవంబును మఱియు ననేకదుష్టపార్థివప్రహ
రణకరణోద్యమంబును మొదలయినవి యద్దేవు దివ్యకర్మంబు లింకం గలియుగాం
తంబునఁ గల్క్యాత్మకుం డై విష్ణుయశుం డనుపేర నవతరింపంగలవాడు.

69


చ.

హరియవతారసంకథన మాగమసమ్మిత మాద్యసంయమీ
శ్వరహృదయానుమోదనము సన్మతిఁ బ్రాంజలియై పఠించినం
దిరముగ విన్న నాపదుదధిం దరియించి నరుండు మంగళ
స్ఫురణము లెల్లఁ గాంచి తగఁ బొందుఁ దుదిన్ హరిలోకవాసమున్.

70


వ.

అని యుపన్యసించి వైశంపాయనుండు జనమేజయునితోఁ ద్రివిక్రమావతార
శోభితుం డైనవిష్ణుపరాక్రమంబు లింకనుం గీర్తించెద విను మని యి ట్లనియె.

71
  1. కఱువులు
  2. ననేక
  3. సంఖ్యసుపుత్రపౌత్రాదు లగుచు
  4. నవని