పుట:హరివంశము.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

హరివంశము


వ.

అమ్మహాధ్వరంబునందు.

54


మ.

అమితస్వర్ణమణిప్రతానము లసంఖ్యస్యందనాశ్వేభగో
సముదాయంబు లగణ్యధాన్యగృహవాసస్తల్పదాసీసమూ
హము [1]లత్యుత్తమయోగ్యభూసురుల కుద్యద్భక్తితో నిచ్చె దా
నముగా నాదివదాన్యుఁ డీతఁ డని తన్ వర్ణింపఁ ద్రైలోక్యమున్.

55


వ.

మఱియుఁ గశ్యపమునీంద్రునకు నఖిలక్షోణియు [2]మఖదక్షిణగా నొసంగి కృష్ణా
జినోత్తరీయుండు జటాముకుటమండలియు నై మహేంద్రపర్వతంబునందు సర్వ
లోకహితార్థంబు నేఁడును దపంబు సేయుచున్నవాఁ డట్టిజామదగ్న్యుజనన
[3]వ్యాపారంబులు నివృత్తంబైన యనంతరంబ.

56

శ్రీరామావతారక్రమంబు సంక్షేపరూపంబునం జెప్పుట

క.

ఇరువదినాలవత్రేతను, హరి దశరథభూమిపతికి నాత్మవిభూతి
స్ఫురణము చతురంశములుగ, [4]విరచించి జనించె భువనవిప్లవహృతికిన్.

57


వ.

అన్నాలుగు మూర్తులయందు నగ్రజుండు.

58


మ.

అమలాంభోజదళాక్షుఁ డక్షయఘనశ్యామాంగుఁ డాజానుదీ
ర్ఘమహాబాహుఁడు సంహతోరుకఠినోరస్కుండు సింహో[5]రువి
క్రమణుం డద్భుతశౌర్యధైర్యకలనాకల్యుండు కళ్యాణధీ
రమణీయుండు వెలింగె రాముఁడు గుణారాముండు భూమండలిన్.

59


ఉ.

శైశవకేళియంద తనసత్త్వము లోకము ప్రస్తుతింపఁగాఁ
గౌశికుఁ డస్త్రకోటి యొసఁగంగఁ బ్రదీప్తతనొంది తన్మఖ
క్లేశకరున్ సుబాహుఁ డనుకిల్బిషరాత్రిచరున్ ససైన్యుఁ గీ
నాశునిఁ జేర్చి పేర్చె జననాథతనూజుఁ డజేయుఁ డై యనిన్.

60


క.

వైదేహకన్య పురరిపు, కోదండధ్వంసశుల్క గోరి యతని చే
తోదయిత యయ్యె సాక్షా, చ్ఛ్రీదేవి యయోనిజాత సీత యనంగాన్.

61


చ.

అనుపమనూత్నయౌవనమునంద పితృప్రియకారియై విభుం
డనుజుఁడు ధర్మపత్నియు నిజానుగమం బొనరింపఁ గాననం
బునఁ బదునాలుగేఁడులు తపోనియతిన్ వసియించి దేవతా
మునిజనరక్షణక్రియ లమోఘముగా నొనరించె నన్నియున్.

62


క.

ఖరు మారీచునిఁ గూల్చుట, విరాధునిఁ గబంధు శాపవిచ్యుతిలాభ
స్ఫురితులఁ జేయుట యాదిగఁ, బరఁగినయవి తద్వనాంతపర్యట[6]నవిధుల్.

63


తే.

భూరిబలసత్త్వమున నెందుఁ బొగడుగనిన, వాలి వధియించి సుగ్రీవు వానరేంద్ర
పదవియం దుంచె నద్దేవుఁ డుదధిలోన, నిలిపె [7]సేతువు నాశ్చర్య మొలయఁ బేర్మి.

64
  1. లత్యంతము
  2. మఘ
  3. వ్యానకంబులు
  4. విరచించెను భువనరక్ష విభవప్రీతిన్
  5. పమ
  6. నంబుల్
  7. సేతువాశ్చర్య మై వెలయ