పుట:హరివంశము.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము ఆ. 4

89


తే.

ఇనునిఁ దనమౌళిరత్నంబు నిద్ధహార, తరళరత్నంబు గటిసూత్రపరిధిమధ్య
రత్నమును నూపురాగ్రవిరాజమాన, రత్నమునుఁ జేయుచును బ్రవర్ధనము బొందె.

47


వ.

ఇట్లు విక్రమమాణుం డైనయాత్రివిక్రమువిక్రమంబు సైరింపక [1]విప్రజిత్తి యశ్వ
[2]శిరుండు శ్వపతియు, శంకుండు శంకుకర్ణుండు పుష్కరుండు నికుంభుండు బాష్క
లుండు గగనప్రియుండు [3]సమ్మతుండు శరభుండు బృహత్కీర్తి మహాజిహ్వుండు
శంబరుండు విక్షరుండు [4]వేత్రుండు నింద్రతాపసుండు వాతాపి యసిరోముండు
పులోముండు వైశికుండు కాలదమనుండు కరాళుండు రాహువు మొదలుగాఁ
గల యసురముఖ్యులు కూర్మకుక్కుటలకమకరసృగాలబిడాలాద్యనేకవికృతవక్త్రం
బులు బహుబాహుచరణమస్తకంబులుం గలవికటకాయులు నగు రాక్షసుల
తోడంగూడఁ బరిఘుపట్టిసప్రాసకృపాణప్రముఖప్రహరణంబులు దాల్చి యతనిఁ
జిక్కువఱచుటకై యొక్కట కడంగి పొడిచినఁ బదజానుకూర్పరకరతలాహతుల
నందఱం దూలించి యవ్విశ్వరూపధరుండు విశ్వంబు నాక్రమించి.

48


క.

అవలీల నసురనాయకు, నవమానితుఁ జేసి త్రిభువనాధీశ్వరవై
భవ మొసఁగె నింద్రునకు ముని, నివహంబులు ప్రస్తుతింప నిఖిలము నలరన్.

49


వ.

వామనావతారం బాకర్ణించి తింక జామ[5]దగ్న్యునవతారంబుఁ జెప్పెద వినుము.

50

పరశురామావతారంబు సంక్షేపరూపంబుగాఁ జెప్పుట

శా.

అత్రిప్రోద్భవుఁ డద్భుతాత్ముఁడు త్రిలోకారాధనీయుండు ద
త్తాత్రేయుం డనుసంయమీంద్రుఁడు సరోజాక్షావతారంబ యి
ద్ధాత్రిం దొల్లి సమస్తధర్మములు విధ్వస్తంబు లై పోయినం
జిత్రైశ్వర్యముపేర్మిఁ గ్రమ్మఱఁ బ్రతిష్ఠించెన్ మునిశ్లాఘ్యుఁ డై.

51


మ.

అతనిం బుణ్యయశోవిజృంభితుఁ [6]గృపైకాయత్తచిత్తాంబుజుం
గృతవీర్యాత్మజుఁ డైన యర్జునుఁడు భక్తిం గొల్చి తేజస్సము
[7]ద్ధతదోస్తంభసహస్రమున్ సకల[8]గోత్రామండలైకాధికా[9]
దృతియున్ యోగ్యవిభూతియున్ బడసి యుద్దీపించె [10]విప్రస్తుతిన్.

52


సీ.

జమదగ్నిసుతుఁ డగ్నిసదృశతేజుఁడు రాముఁ డై జనియించి విశ్వాత్ముఁ డాద్యుఁ
[11]డాకార్తవీర్యు నహార్యధైర్యుని ననేకాత్మజబంధుసహాయు ఘనుని
నాజిలోఁ దొడరి యుత్తేజితపరశుధారాముఖంబున నతిరౌద్రభంగిఁ
దునుమాడి యాతనిఁ దొడరి పారావారపరివేష్టితాఖిలధరణిఁ గలుగు


తే.

నరపతులనెల్ల వరుసతో నిరువదొక్క, మాటు [12]ద్రుంగించి నెత్తురు[13]మడువులయిదు
నిలిపి కోపంబు మాని యస్థలితనియతి, నశ్వమేధయాగంబు రమ్యముగఁ జేసె.

53
  1. విప్రచిత్తి
  2. శంకుండు
  3. సంహరుండు
  4. వృత్రుండు
  5. దగ్నిరామా; దగ్న్య.
  6. గృపాయత్తైక
  7. న్నత
  8. గోపా
  9. కర్తృతయున్, సాధృతమున్.
  10. ధీప్రస్తుతిన్
  11. ఆకార్తవీర్యాఖ్యు నసహాయశౌర్యు నాత్మజబంధుమిత్రసహాయఘనుని
  12. మర్దించి. (అ)
  13. మడువు లందు