పుట:హరవిలాసము.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక 15

తే. శాంభవీశంభులోచనోత్సవకరములు
వాసవాద్యమృతాశనవందితములు
విఘ్నరాజ మదోల్లాసవిభ్రమములు
మించి విఘ్నోపశాంతిఁ గావించుఁ గాత. 5

సీ. వేదండవదనశుండాదండగండూష
కాండసిక్తాప్సరోమండలములు
గంధర్వకన్యకాకనకసౌగంధిక
మాలికాలగ్నషాణ్మాతురములు
నందీశ్వరక్షిప్తనారంగఫలపాక
తరళవిద్యాధరీస్తనభరములు
గరుడలీలావతీకస్తూరికాపంక
పిహితనిశ్శేషాంగభృంగిరిటులు

తే. వీరభద్రవికీర్ణకర్పూరచూర్ణ
ధవళితాకాశచరవనితాముఖములు
శాంభవీశంభుమధుకేళిసంభ్రమములు
పొదలి వాసించుఁ గాత నా హృదయవీథి. 6

వ. అని ప్రార్థించి త్రిపురాంతకదేవదివ్యశ్రీపాదపద్మారాధకుండును, బరమసాధకుండును, గమలభవోరుప్రదేశసంభవవిమలవంశావతారుండును, ధర్మద్రావిడబిరుదాధారుండును, సుజనవిధేయుండును, గర్పూరవసంతరాయండును, గీర్తివనితావల్లభుండును, బ్రతిదినసమారాధితపరమేశ్వరుండును, మాణిక్యసింహాసనాధీశ్వరుండును, నంగీకృతభూసురాశీర్వాదుండును, దానధర్మపరాయణుండును, నిమ్మడి గరుడనారాయణుండును, నిజకీర్తిశాసనస్తంభాయమానదిగంతదంతావళదంతుండును, నుభయద్రావిళుండును, గిష్కింధాచలక్రీడావినోదుండును, వశీకృతనిఖిలభూభుజుండును, సతతత్యాగధ్వజుండును, వినిర్మలకులశీలుండును, బాండ్యరాయకందుకక్రీడావిలోలుండును, గవిజనస్తోత్రపాత్రుండును, గౌండిన్యగోత్రపవిత్రుండును, జతుష్షష్టివిద్యాజన్మభూమియు, నయోధ్యానగరస్వామియో యనఁ బరఁగి జంబూద్వీపభూభువనమండలీమకుటమండనాయమానం బగు కొండవీడుపురంబు రాజధానిగాఁ గీర్తిలతాధిష్ఠితాష్టాదశద్వీపాంతరాళుండగు కొమరగిరి వసంతనృపాలువలన నాందోళికాచ్ఛత్రచామరతురంగాది రాజచిహ్నములు వడసి యమ్మహారాజునకుం బ్రతివత్సరంబును సంవత్సరోత్సవంబునకుం దగిన కస్తూరీకుంకుమఘనసారసంకుమదహిమాంబుకాలాగురుగంధసారప్రభృతి సుగంధద్రవ్యంబు లొడఁగూర్చియుఁ, జీని సింహళ తవాయి హురుముంజి జోణంగి ప్రభృతి నానాద్వీపనగరాకరంబులగు ధనకనకవస్తువాహనమాణిక్యగాణిక్యంబులు తెప్పించియుఁ, గవి గమకి వాది వాంశిక వైతాళికాదులగు నర్థిజనంబులకు నర్థంబులు గుప్పించియు, ధీరుండును నుదారుండును గంభీరుండును సదాచారుండును నన విఖ్యాతి గాంచిన యవచి తిప్పప్రభుం డొక్కనాఁ డాస్థానమండపంబున సుఖోపవిష్టుండై. 7

సీ. కమలనాభుని పౌత్రుఁ, గవితామహారాజ్య
భద్రాసనారూఢుఁ, బరమపుణ్యుఁ,
బాత్రు, నాపస్తంబసూత్రు, భారద్వాజ
గోత్రు, సజ్జనమిత్రుఁ, గులపవిత్రు,