పుట:హరవిలాసము.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

హరవిలాసము

పీఠిక

శ్రీమహిళాపయోధరహరిన్మణిహారము, హస్తి భూధర
స్వామి, పయోజసంభవుని జన్నముఁ గాచిన వేల్పు, దేవతా
గ్రామణి, కంచి శ్రీ వరదరాజు మనోహర పుణ్యకోటి వీ
థీమణిమండితుం డవచి దేవయ తిప్పుఁ గృతార్థుఁ జేయుతన్.

ఉ. మావిడి మోక క్రింద నిగమత్రయయార్థసమృద్ధిఁ పార్వతీ
దేవి కుచంబులన్ బదను దీర్పని కస్తురిముద్రగా జగ
జ్జీవనకారణం బయిన శ్రీనిధి కంచిపురీశ్వరుండు మా
దేవయసెట్టి నందనుని దిప్పుఁ గృతార్థుని జేయుఁ గావుతన్.

సీ. ఏదేవి తుఱుముపై నేఁడుకాలము దాఁకఁ
గసుగందకుండుఁ జెంగలువ దండ;
యేదేవి సేవింతు రేకామ్రనాథుండుఁ
గరి గిరీశ్వరుఁడుఁ గింకరులు వోలె;
నే దేవి మణి దివ్యపాదుకాయుగళంబుఁ
బాతాళపతి మోచుఁ బడగ లందు;
నే దేవిఁ గొల్చి మత్స్యేంద్రనాథాదులు
యోగసంసిధ్ధికి నొడయు లైరి;
తే. యమ్మహాదేవి కామాక్షి యఖిలవంద్య,
దేవతాదిమశక్తి సందీప్తమూర్తి
యవచి దేవయ త్రిపురారి కర్థి నొసఁగు
భాగ్యసౌభాగ్యవైభవప్రాభవములు.

క. వాణికిఁ, జరణానత గీ
ర్వాణికి, నేణాంకశకలరత్నశలాకా
వేణికిఁ, బుస్తకవీణా
పాణికి, సద్భక్తితో నుపాస్తి యొనర్తున్.

సీ. కలితశుండాదండగండూషితోన్ముక్త
సప్తసాగరమహాజలభరములు
వప్రక్రియాకేళి వశవిశీర్ణసువర్ణ
మేదినీధరరత్నమేఖలములు
పక్వజంబూఫలప్రకటసంభావనా
చుంబితభూభృత్కదంబకములు
వికటకండూలగండకదేహమండలి
ఘట్టితబ్రహ్మాండకర్పరములు