పుట:హంసవింశతి.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

238 హంస వింశతి

ఘళఘళార్భటులతో ఫళఫళారను వాన
ధార్తరాష్ట్రాది మహార్తి నింపఁ
జిటచిటారవముతోఁ దటతట వడగండ్లు
యువరాజ ముఖులను నొదుగఁజేయ
తే. విజయ విఖ్యాతి నమ్మహావృష్టి సమర
మమర వరధర్మవిలసనం బనిలజాత
ఖేలనము కృష్ణ ఘనయుక్తి చాలఁ గలిగి
యవని జనములు వినుతింప నతిశయించె. 221

క. ఆయెడ సఖు లొకఁ డొక్కఁడు
కూయిడి జతఁగూడ కెడసి కునుకుపరువులం
బోయిరి చెంగటి యూరుల
కా యూరవ్యుఁడు హిరణ్యుఁ డట్లతిగతితోన్. 222

తే. వడఁకు చట భద్రసేన యావాసమునకుఁ
బోయి “నేను ప్రవాసి నో పుణ్యురాల!
తడిసితిని వర్షధారలఁ దాళఁజాల
నేర్పెఱఁగ నిందు రానిమ్ము! నిద్రఁ జెంద.” 223

క. అని వేఁడిన వైదేశికు
ఘనకరుణాదృష్టిఁ జూచి కామిని, “పడుకొ”
మ్మని ముంగలి చావిడిఁ జూ
పిన హా లక్ష్మీ యటంచుఁ బేర్కొని యచటన్. 224

చ. తడిసిన వస్త్రముల్ విడిచి తాళ్లపయిన్ వెస నాఱవేసి, “యో
పడఁతుక ! నీదు పెద్దలకుఁ బల్కఁగ శక్యముగాని పుణ్య మ
య్యెడు నిట కగ్నిఁ దెచ్చి సెగ యించుక చూపు” మటంచు వేఁడఁగాఁ
దొడివడి యట్లొనర్చి యల తొయ్యలి యాతని రూపసంపదల్. 225