పుట:హంసవింశతి.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

214 హంస వింశతి



యని నగి వీపుఁ దట్టి, “చనుమా! పగఁ జాటుచు, మళ్ళీ చూడ కే
మనకను రెడ్డి తోడ" నని యా సఖి పంచిన నాతఁ డంతటన్. 166

వ. "మంచి" దని యప్పుడు. 167

క. త్వరితమ్ముగఁ దల వాకిలిఁ
దెఱచుక బంట్రవుతు నోటి తీఁటయుఁ దీఱన్
బొరి పొరి వదరుచుఁ జనియెడి
తెఱఁగు నిరీక్షించి రెడ్డి తెగువన్ మగువన్. 168

తే. పిలిచి కోపారుణాక్షుఁడై పేర్చి పలికె
“నేమి బంట్రోతుగాఁ డిటు లెమ్మె మెఱసి
వచ్చినాఁ డదిగాక తా వదరుకొనుచుఁ
బోవుచున్నాఁడు సెప్పుమా! పువ్వుబోఁడి”. 169

క. అని పతి యడిగిన జడియక
“వినుమా!" యని రెడ్డిసాని వింతలు గులుకన్
నునునగ వొప్పఁగఁ జెప్పెను
“గనుమా! యీ సెట్టిగాని, ఘర్షణ మొదవన్. 170

తే. నగరివారలు పిల్చుచున్నా రటంచుఁ
దఱుముకొని రాగ నిలుఁజొరఁ దలుపువేయ
గోడతఁడు దూకి వచ్చి తోడ్కొనుచుఁ బోవ
‘రెడ్డి లేఁడు గదా’ యని యడ్డ పడితి. 171

ఉ. అంతట నీవు వచ్చితివ యాతఁడు నాగ్రహవృత్తిచేత న
న్నెంతయు దూఱుకొంచుఁ జనియెన్ మగఁడా !” యని చెప్పి వైశ్యునిన్
జెంతకుఁ జేరఁ బిల్చిన వసించు కుసూలము వెళ్ళి సాధ్వసా
క్రాంతశరీరుఁడై యెదురుకట్లకు వచ్చిన రెడ్డి యంతటన్. 172