పుట:హంసవింశతి.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 215



తే. వాని దయఁ జూచి “నేనున్న వాఁడ నీవు
భయపడకు సెట్టిగా!" యని పల్కరించి
పొమ్మనిన మస్తకవిధూననమ్ము చేసి
యేఁగె నాతఁడు తనయింటి కేమి యనక. 173

ఉ. ఆవిధి బొంకనేర్చిన నృపాగ్రణి దగ్గర కేఁగుమన్న హే
మావతి నాసికాగ్రమున మాటికి వ్రేలిడి కర్ణపత్ర శో
భావళి చెక్కులన్ నటనమాడ శిరంబటులూఁచి మెచ్చుచున్
వేవినఁ జూచి యంత నిజవేశ్మముఁ జేరఁగ నేగె గొబ్బునన్. 174

క. ఈ గరిమను నిజగృహమున
కేగి ధరాధీశమోహ హృదయాంబుజయై
యా గజగామిని యొండొక
లాగున దినమెల్లఁ గడిపి లలి నిశియైనన్. 175

చ. ఘనశితికంఠకంఠ కలకంఠ ఘనాఘన నీలకంఠ కం
జనయన ఖంజరీట బలశాసన నీల తమాలమాలికా
ప్రణుత మృగేక్షణా చికురభార మృగీమద చంచరీక కా
ననకిట కొక కజ్జల వనద్విప సన్నిభమైన చీఁకటిన్. 176

ఉ. కొప్పున జాజిక్రొవ్విరులు కుంకుమగందపుఁబూత గుబ్బలన్
గొప్ప సుపాణి రాసరులు గోమలదేహ లతాంతవల్లికన్
గప్పెడు సొమ్ము పెన్సిరులు గన్నుల పండువు లాచరింపఁగా
నెప్పటియట్ల వచ్చి హరిణేక్షణ నిల్చెను హంస సన్నిధిన్. 177

ఆ. నిలువఁ గలువకంటి చెలువంబు వీక్షించి
దినము దినము నొక్క తెఱఁగు దోఁప
సొగసుఁ బూన నేర్చు సుందరాంగివి నీవె
యనుచు మెచ్చి హంస మనియె సతికి. 178