పుట:హంసవింశతి.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64 హంస వింశతి

మఱల నాశుభభద్రు నివాసభూమి
యప్పురంబున సంతతం బొప్పుచుండు. 11

తే. గొప్పకన్నులు చిఱునవ్వు గులుకు మోము
బవరిగడ్డము చక్కనై పరగు ముక్కు
నెగుభుజంబులు విపులత్వ మెసఁగు ఱొమ్ము
జిగి మిగులు లీలఁ గనుపట్టుఁ దొగటసెట్టి. 12

ఉ. ఆఁటది నేర్పుతో నగల యందముఁజందముఁ జూపఁబూని కో
లాటము చేయు కైవడిని లాలితదృక్తరళప్రభావళుల్
పాటిగఁ బోఁగు వెంబడిని బార్శ్వములం జరియింప వస్త్రముల్
ధాటిగ నేయు నప్పలుక తట్టున బెట్టు ఖణిల్ఖణిళ్లనన్. 13

తే. అరవిరుల తేనియల చాలు మరునివాలు
మిసమిసలప్రోలు వలరాజు మేటిరాడాలు
మురిపెముల మెచ్చుకొనఁజాలు ముద్దరాలు
వాని యిల్లాలు దొమ్మరవాని డోలు. 14

ఉ. దాని ముఖప్రఖాగరిమ దాని కపోలకళావిశేషముల్
దాని బెడంగుచూపులును దాని కుచంబులఁ జెందు నందమున్
దాని వచోవిలాసములు దాని కచాళిరుచుల్ గణింపఁగా
మానవతీలలామ! విను మర్త్యు లమర్త్యులు నైన శక్తులే? 15

క. జిగిఁజిలుకు కులుకు గుబ్బలు
నిగనిగలు చెలంగు నెఱులు నిద్దపుఁ గన్నుల్
నగవు దళుకొత్తు మోమును
మగువా! యాబిడకె కాక మఱి కలదటవే? 16