పుట:హంసవింశతి.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 65



క. తొడలందము కటిచందము
నడుగుందమ్ముల బెడంగు లాస్యము రంగుల్
జడతళుకున్ మెడకులుకున్
నడబెళుకున్ జూడ నాఘనస్తని కమరున్. 17

తే. చిన్నచీమల నునుబారు చెలువయారు
కదళికాకాండముల మీఱుఁ గాంతయూరు
లందములఁ జెందు రతిఁగేరు నతివసౌరు
దానికెనయైన నారు లిద్ధరణి లేరు. 18

క. కందర మా చెలిపొక్కిలి
కంద రమా విలసనములు కచములు, రదముల్
కుంద రమా సమములు నా
కుం దరమా? పొగడ నల కుకుందరసుకటిన్. 19

సీ. మిళదంబు జలదంబు బలుడంబు చెలువంబు
దులకించు నమ్ముద్దుఁగలికివేణి
సిరిపట్టుగల గట్టుజిగిగుట్టు వెలిఁబెట్టు
చెన్నారు నక్కన్నె చన్నుదోయి
నునుకందు పైఁజెందునని యిందురుచిఁ గ్రించు
పఱుపఁగాఁ జాలు నబ్బాలమోము
తెలిదమ్ములను గ్రమ్ము కళఁ జిమ్ము ననయమ్ము
మిన్నయౌ నబ్బోటి కన్నుఁగవయుఁ
తే. దావి తేనియబావి యందముల దీవి
మావి చిగురుచెంగావి మారుఠీవి
కప్పురంబుల క్రోవి యక్కాంతమోవి
యనుచు వినుతింప నానేఁతవనిత యలరు. 20