పుట:హంసవింశతి.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



తే. పుత్రకుని వాక్యవిస్ఫురద్బోధమునకుఁ
దల్లిదండ్రులు సంతోష ముల్లసిల్ల
నపుడు పాషాణభేదుల కర్థ మిచ్చి
ఠీవి నొక దేవళంబుఁ గట్టించి రపుడు. 179

సీ. డంబై న గర్భగృహం బంతరాశికం
బును ముఖమంటపంబును జెలంగ
గాలిమంటపము ప్రాకారంబు లోవలు
బోదెలు చుట్టలు పొందు పడఁగఁ
గప్పట చట్టముల్ ఘన గోపురమ్ములు
జగతియుఁ జప్పటల్ సొగసు గులుక
గచ్చుగోడలు ఱాతికంబముల్ పాలసు
న్నము సువర్ణము ద్వారసమితి వెలయ
తే. దృష్టిపాత్రపు బొమ్మలు తేజరిల్ల
నుఱుకు సింగంబు లరగూళ్ళు మెఱుఁగుఁ దోర
ణములు చిత్తర్వు క్రొంబనుల్ రమణ కెక్క
దేవళము మించె నత్యంతదివ్య మగుచు. 180

క. ఆ దేవళంబులోన మ
హాదేవుని నొక్క దివ్యమగు శుభవేళన్
బాదుగఁ బ్రతిష్ఠ చేసిరి
వేదాగమశాస్త్రరీతి వేడ్క దలిర్పన్. 181

సీ. చెఱఁగు దోవతి పైనిఁ జీరాడఁగా బోడి
తలచుట్టు ధౌతవస్త్రంబు మెఱయఁ
జెక్కులకును దిగి పిక్కటిల్లు విభూతి
పెండెకట్లు లలాటభిత్తి నమర
గళమున నులిగొన్న కావిదారముతోడి
రుద్రాక్షమాలికల్ రూఢిఁ దనర