పుట:హంసవింశతి.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మారేడు బుఱ్ఱలో మక్కళించిన సందిఁ
గట్టిన చంద్రశేఖరుఁడు వెలయఁ
తే. బెట్టె మూఁకుడు లోపల బిల్వపత్రి
మట్టి ధూపార్తి దీపముఁ బెట్టు చమురుఁ
బొందుపఱచుక మునిమాపు పూజసేయఁ
గ్రొత్త కాణాచి తంబళి హత్తుకొనియె. 182

క. ఈ తీరున నల తంబళి
భూతేశుని పూజ సేయఁ బుష్పంబుల సం
ఘాతముఁ గొని తేలేమని
యా తట్టున నొక్కతోఁట నమరఁగఁ జేసెన్. 183

సీ. సంపెఁగల్ మొల్లలు జాజులు గన్నేర్లు
విరజాజులును మంచి కురువకములు
పొద్దుదిరుగుడు పూల్ పొన్నలు మల్లెలు
పారిజాతములు సేవంతి విరులు
తామరల్ సూర్యకాంతమ్ములు కల్వలు
బొండుమల్లెల పొదల్ పొగడ తరువు
లల్లి పువ్వులుసు నంద్యావర్తములు వాడ
గన్నేరులు తురాయి గట్టిపూలు
తే. మాచిపత్తిరి గగ్గెర మరువము కురు
వేరు దవనమ్ములును వట్టివేళ్ల గుములు
బిల్వవృక్షము లాదిగాఁ బేరుగలవి
ప్రబల నొక తోఁట వేయించి బావిఁ ద్రవ్వె. 184

మ. అమితానర్ఘ్యనిబద్ధశుద్ధశశికాంతాయామసోపానసం
గమ, మంబుగ్రహణాగతోరుపథికాక్రాంతస్పురత్కుట్టిమం
బమలాంభోరుహషండపాండుకుముదాచ్ఛామోదసంవాసితం
బమృతప్రాయజలాభిపూర్ణ మగుచు న్నాబావి యొప్పుం గడున్. 185