పుట:హంసవింశతి.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ix


సన్నివేశములో యతని కథలలోఁ బొడసూపినచో దాని కతఁడుత్తరవాది కాఁడనియు మనము గ్రహింప వలెను.

హంస వింశతి అష్టమరాత్ర కథ.

వసుమతీ ధనచిత్తులు వైశ్య దంపతులు. భర్త పరస్త్రీ సక్తుఁ డయ్యెను. భార్య పరపురుష సక్త యయ్యెను. ఒకనాఁటి చీకటిలో సంకేత స్థలమున నుభయులు తారసిల్లిరి.

తే. తాను గోరిన కన్య యీతరుణి యనుచుఁ
   జేరె నాసక్తిచే ధనచిత్తుఁ డపుడు
   ఆ యువాగ్రేసరుం డీతఁ డౌ నటంచుఁ
   గదిసె వసుమతి యత్యంత కాంక్షతోడ. (2-247)

ప్రాఁత రోఁత క్రొత వింతకదా ! ఆమె నూతన స్త్రీయని యతఁ డనుకొనెను. అతఁడు నూతన పురుషుఁడని యామె యనుకొనెను. ఈ యనుకొనుట. మనస్సు చేసినపని. దాని వికార మెట్లు విజృంభించినదో యీ పద్యముఁ జూడుఁడు.

మ. సహసా సంఘటిత స్తన గ్రహణ సంజాతాంగ రోమోద్గ మం
    బు, హఠాచ్చుంబిత పాటలాధర ముఖాంభోజాక్షి గండంబు, దు
    స్సహ నీవీచ్యుతి కంచుకాహృతి నఖాంచద్దంత గాఢక్షతా
    వహనం బిర్వురకయ్యె సంగమము దిగ్వారార్పితేక్షాళియై. (2-249)

ఇంత జరిగిన తరువాతఁ గాని వారొకళ్లొకళ్లు తెలిసికొనుట జరుగలేదు. దంపతులను గలిపి గమ్మత్తు చేయుట అదొక విలక్షణ శిల్పము. శుకసప్తతియు నిటువంటి దొక కథ చెప్పినది. శుభవతీ మోహన దంపతులు చీఁకటిలోఁ దారస పడుదురు. కాని వారొకళ్లొకళ్లు ముందుగనే గుర్తించు కొందురు. కనుక దానిలో సారస్య మగుపింపదు. ఆ లోపమును హంస వింశతి తీర్చెనా యనిపించును . కాని యీ కథకు శుకసప్తతి కథ యొరవడి కాదు.