పుట:హంసవింశతి.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

viii


కథలు కవికపోల కల్పితములా?

ఈ కథలకు మూలము లేదు. లోకమే మూలము. లోక ప్రవృత్తి చిత్ర విచిత్రముగా నుండును. ఈనాఁడొక సంఘటనము విచారించి చూచినచో దానికి మూలబీజము అష్టాదశ పురాణములలో ఎక్కడనో యొకచోట గోచరింపకపోదు. అంతమాత్రమున దానికిది పుత్రిక యని చెప్పలేము, ముమ్మూర్తుల ముక్కున ఊడిపడినట్లు ఆకథకు ఈ కథకుఁ బోలిక లున్నపుడే చెప్పఁగలము, పురాణకథా సంస్కార పక్వబుద్ధికిఁ దత్కథా రేఖలు భాసించు కల్పనలు స్ఫురింప వచ్చును. లేదా, లోకమున అటనట జరుగు నుదంతములు క్రోడీకరించి యొక కథగా మల్చుటయు జరుగవచ్చును. రెండును గాదని విపరీతముగా యోజించి కథ అల్లను వచ్చును. ఈ మువ్విధముల కథలతో నడిమి తరగతికిఁ జెందిన కథలే హంస వింశతి యందధికము. కథావ్యక్తులు సామాన్య మానవులు. శుకసప్తతి కథల కీకథలు కార్బన్ కాపీలు కావు. పూర్తిగా స్వతంత్ర కథలే. తన కథలను గుఱించి హేమావతితో వాచ్యముగనే కవి యిట్లు చెప్పించినాఁడు.

“మ. కలహంసాధిప! నీ స్వబుద్ధి నిటులన్ గల్పించెదో. కాక పె
     ద్దలచేఁ బూర్వము విన్నవాఁడవొ, మహా దైవ ప్రసాదంబొ; విం
     తలు సుమ్మిట్లు వచింప నన్యులకు మేధాశక్తి నిన్‌బోలు వా
     రలు లేరింక, బలారె!" (4-67)

దీనిని బట్టి యితఁడు స్వబుద్ధిచేఁ గల్పించెనో పెద్దలచే వినెనో దైవప్రసాదముచేఁ గనెనో యని త్రిథాప్రకీర్ణ మనస్సుతో విచికిత్సింపఁ బని లేదు. “మేధాశక్తి నిన్ బోలు వారలు లేరు" అనుటనుబట్టి యీకథ లితఁడే కల్పించెనని గట్టిగాఁ జెప్పవచ్చును. హంసను బ్రశంసించు వ్యాజమున నాత్మస్తుతి చేసికొనెనని మన మూహింపవలసిన పనిలేకుండఁ గృత్యాదియందే పదునేనవ పద్యమునఁ దనకీర్తి యెట్టిదో, తన మేధ యెట్టిదో, తన దాతృత్వ మెట్టిదో, తన రూప మెట్టిదో, తానే బాహాటముగా వర్ణించు కొన్నాఁడు. ఇతని మేధ బ్రహ్మ, శేషుఁడు, బుధుఁడు బృహస్పతి యీ నలువురు మేధావుల మేధకుఁ 'బ్రతివిఘాతి' యఁట. అట్టివాఁడు స్వతంత్రముగ యోజింప కుండునా ? అతనికిఁ దెలియకుండ యాదృచ్ఛికముగా నెక్కడవైనఁ బూర్వ కథలతో సంవదించు సందర్భములో