పుట:సకలనీతికథానిధానము.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ

సకలనీతి కథా నిధానము

ఎఱ్ఱయ ప్రణీతము

శ్రీలలనాధినాథుఁ డతసీకుసుమాంచితమూర్తి యష్టది
క్పాలకిరీటరత్నరుచిభాసి పదాబ్జుఁడు మిత్రసర్వభూ
పాలుని గుంటముక్లపినభైరవపాత్రుని నేలు సత్కృపా
లోలుఁడు వేంకటేశ్వరుఁడు లోకము లెప్పుడుఁ బ్రోచుగావుతన్.

1


ఉ.

గోత్రతనూభవోరుకుచకుంభపటీరసుగంధిపక్షుఁ డ
క్షిత్రయశోభి శంకరుఁడు శ్రీకరు గంగయభైరపాత్రునిన్
బాత్రవరేణ్యు నేలు శశిభాసికిరీటుఁడు, బ్రోచు గాత లో
కత్రయవాసులన్ సకలకాలము వాంఛితభవ్యసిద్ధులన్.

2


ఉ.

బ్రహ్మమయుండు భారతికిఁ బ్రాణసఖుండు పదాంబుజాశ్రిత
బ్రహ్మ మునీశ్వరుండు [1]సితపంకజమందిరుఁ డప్పరాశర
బ్రహ్మకులాధినాథుఁ బినభైరవునిన్ మహపాత్రశేఖరున్
బ్రహ్మముగాఁగ నేలు వరభావుఁడు లోకముఁ బ్రోచుగావుతన్.

3


ఉ.

కొక్కటె[2] వాహనంబు తలకుం గుసుమంబటె లేతచందురుం
డొక్కటి యట్టెదంతము సముజ్వలమై వెలుగొందుమూర్తిచే
మ్రొక్కినవారి కిష్టఫలముల్ గృపసేయు గణేశ్వరుండు సొం
పెక్కగఁ బిన్నబయ్యన హృదీశుఁడు మర్త్యులఁ బ్రోచుగావుతన్.

4
  1. రణ
  2. ఒక్కట గ్రంథపాాతము