పుట:సకలనీతికథానిధానము.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

సకలనీతికథానిధానము


వ.

అని సల్లాపంబులు సేయుచు మఱియొకర్తి యిట్లనియె.

361


క.

అవివేకి పొందుకంటెను
వివేకముగల జనుతోడి విరసం బొప్పున్
భువనామరు రక్షింపఁడె
వివేకమునఁ దస్కరుండు వింధ్యవనమునన్.

362


వ.

అది యెట్లనిన.

363


ఆ.

బందుగుండు రాఁగ బ్రాహ్మణుఁడొక్కండు
ధనము లేక నతని తమ్ముఁ డున్న
పురికి నరిగి లేమి పరిపాటి నెఱిఁగించి
ధనము వేడుటయునుఁ దమ్ముఁ డపుడు.

364


వ.

ఒక్కయమూల్యం బైనరత్నం బొసంగి పొమ్మని యనిపిన నతం డారత్నంబు మ్రింగి పయనంబై పోవ నొక్కపాటచ్చరుం డెఱింగి పథంబున బ్రాహ్మణు వధియించి రత్నం బపహరింతునని వెంటనె చనుచున్న చోరుండు బ్రాహ్మణుం జూచి యిట్లనియె.

365


ఆ.

నీవు మ్రింగినట్టి నిర్మలరత్నంబు
నాకు నిమ్ము యీక యూరకున్న
పొట్ట వ్రచ్చియైనఁ బుచ్చుకొందునుఁ దాని
నన మలిమ్లుచునకు ననియె ద్విజుఁడు.

366


క.

నీకడువు రత్నదశకము
నాకీయకయున్న నడుము నరకెద ననుచున్
వాకోపవాక్యములఁ బెను
పోకలు పోవంగ నచటఁ బొందిన చోరుల్.

367


వ.

ఇరువురిమాటలు విని దొంగం జంపి పదిరత్నంబులును, బ్రాహ్మణుఁ జంపి రత్నంబునుం బుచ్చుకొందమని యాయిద్దఱినిం బట్టికొనుటయు.

368