పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/465

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

458

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


చుండును గావున జలబుద్బుదంబున నిత్యంబుగాని దేహంబు
నందుండి చతురాశ్రమంబుల నడపి దేవఋషి పితృఋణం
బులం దీర్చి జ్ఞానవైరాగ్యంబు లభ్యసింపవలయు నంటిరి
వేదోక్తకర్మ మర్యాద యగుం గావున నాచరింపందగు
నైనను దేహం బనిత్యం బైనందున ముముక్షుం డైనవాఁడు
కర్మారణ్యంబునం బ్రవేశింపఁ డనిన శుకుం జూచి సూర్యుఁ
డిట్లనియె.

159


శా.

ఆదిన్ విశ్వము వృద్ధిచేయుటకుఁ బద్మాక్షుండు గల్పింపగా
వేదోక్తాశ్రమధర్మకర్మతతి భూవిఖ్యాతమై యుండగా
గాదంచు న్విడనాడి నీ వెగిరిపోగా వచ్చునే యంచు న
య్యాదిత్యుండు వచింపఁగా శుకుఁడు నెయ్యంబొప్పగా నిట్లనెన్.

160


సీ.

వనజాప్త విను సర్వవర్ణాశ్రమాచార
        ధర్మంబులును మోక్షధర్మములును
మాతండ్రి బోధింప నాతత్వవిజ్ఞాన
        మాత్మయం దుదయించె నపుడ గురుని
గాంచి యిట్లంటి నిక్కంబుగఁ బ్రథమాశ్ర
        మమున నాత్మవివేక మమరఁ గలిగి
నట్టివాఁ డావలి యాశ్రమధర్మముల్
        విడువఁగ వచ్చునో విడువరాదొ


తే.

తేటగా నిశ్చయము నాకుఁ దెలుపుఁ డంచు
నేను బ్రార్థింపఁగాఁ జూచి నెనరుచేతఁ
జెప్పఁజాలక మిథిలేశుఁ జేరి యడుగు
మనఁగ నేఁ బోయి జనకు నట్లడుగ నతఁడు.

161