పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

359


జ్యోతిర్లతావళుల్ చూపట్టె హేమాద్రి
        కీవల నున్నట్టి [1]యిఱుల నెల్లఁ


తే.

బట్టి గొట్టెను కో యనునట్టిరీతి
నుదయగిరియందు వనజాప్తుఁ డొందె నైజ
కిరణములఁ జూపి యిఱులెల్ల నురుభయంబు
వడి వడంకుచు డాఁగె నప్పుడు కడంగి.

183


ఆ.

హరిని లేపి పెండ్లి కంపించుటకు శుభ్ర
వస్త్రమును ధరించి వగఁ జెలంగఁ
దూర్పుపడతి భక్తితో వచ్చెనో యనఁ
దూర్పుఁ దెల్లగాను దుఱఁగలించె.

184


తే.

పసుపు సున్నము బంగరుపళ్లెరాన
నీటితోఁ గల్పి చక్రికి నెమ్మి యార
తీయు నొసంగుటకై ఛాయదేవి తెచ్చె
ననఁగ నరుణోదయంబయ్యె నంతకంత.

185


క.

మక్కువతో హరి పెండ్లికి
గ్రక్కునఁ బోవలయు ననెడుకైవడి నపు డా
చక్కని యుదయాచలమున
నెక్కుచు రానుండె వేడ్క నెసలారంగన్.

186


తే.

చంద్రకిరణంబులకు హరిసరవి నేత్ర
సరసిజము మూసుకొనియుండఁ జనదటంచు
నెంచి లేచినవాఁడేమొ యంచుఁ జూడ
వికసితములయ్యె ననినట్ల విష్ణుఁ డపుడు.

187
  1. ఇఱులు = చీఁకటి