పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

330

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


హరికడ కేతెంచు మచట బ్రహ్మాదులు
        వచ్చి చేయుదురు వివాహపనులు


తే.

పొమ్మనంగను విని వింతఁ బొంది వకుళ
వచ్చి వరహావతారుఁడు పల్కినట్టి
పల్కు లెల్లను వచియించెఁ బద్మనాభు
నకు విచారంబు లేకుండ నయము మెఱసి.

95


వ.

అంత నాశ్రీకాంతుండు స్వాంతంబున నెంతయు సంతసించి
యంతరంగంబున గరుడుల స్మరింప నప్పు డుప్పొంగి యప్పన్న
గేంద్రుండును గరుడుండు నావేంకటాద్రికి వచ్చి చక్రికి
దండప్రణామంబు లాచరించినం జూచి రెండు శుభపత్త్రికలు
లిఖించి వారలచే నొసఁగి యిట్లనియె.

96


ఆ.

గరుడ నీవు వోయి కంజసంభవున కీ
లిఖిత మిమ్ము మఱియు నిఖిలబంధు
సహితముగను వచ్చి సంతసముగ నాకు
క్షిప్రముగను బెండ్లి సేయు మనుము.

97


క.

పొమ్మని యావిహగేంద్రుని
సమ్మదమునఁ బంపి శేష! శర్వుని బిలువం
బొమ్ము కుటుంబయుతంబుగ
రమ్మను నా పెండ్లి కెలమి రయమున శివునిన్.

98


మ.

అని నారాయణుఁ డంపఁగా నపుడు శేషాఖ్యుండు శ్రీకంఠుఁ బి
ల్వను బోయె న్విహగేంద్రుఁ డంత వడి నవ్వాణీశ్వరుం జేరికొ
మ్మని యాపత్త్రిక చేతి కిచ్చె నపు డయ్యంభోజగర్భుండు గ
న్గొని యచ్చో మును లెల్లరు న్వినఁగఁ దాఁ గూర్మిం బఠించెం దగన్.

99