పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

304

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


బడుచు గల్గినవారు పట్టుగ నామూల
        మెఱుఁగఱు గనుక నా కీయ మనుచుఁ
బొమ్మన నటుమీఁదఁ బోఁగూడ దచటికి
        మొదట సంధానమే కుదురవలయు


తే.

ననుచు యోచించి సర్వజ్ఞుఁ డయ్యు నరుని
కరణిఁ జింతించి తాను శీఘ్రముగ లేచి
యప్పఁడతిఁ జూడఁగోరి మోహంబుచేతఁ
దాళనోపక యొకవిచిత్రం బొనర్చె.

4


ఉ.

అవ్విధ మెట్టులన్న వినుఁ డబ్జదళాక్షుఁడు జీర్ణవస్త్రమున్
నివ్వటిలంగఁ గట్టుకొని నేరుపు మై నొకప్రాఁతకంచుకం
బవ్వల బాగుగాఁ దొడఁగి యవ్వవిధంబున నొంగి లేచుచున్
నవ్వుచుఁ గొండ డిగ్గి తన నాఁడెము లోకులకెల్లఁ జూపుచున్.

5


సీ.

దంతపుసొమ్ములు తగుబండి గురిగింజ
        దండ లొప్పఁగ మెడనిండఁ దాల్చి
నీరజభవు నేడునెలలబాలుని చేసి
        యాదరించుచుఁ బ్రక్క నంటఁగట్టి
సంకుటుంగరములు పొంకంబుగాఁ బెట్టి
        తగువగు నొక్కబెత్తంబు వట్టి
ముసుకొని నవధాన్యములు నించి యొకబుట్టి
        శిరమునం దిడుకొని శీఘ్రముగను


తే.

బోయి నారాయణాఖ్యసత్పురము సేరి
చెలఁగి యాయూరియమ్మలక్కలను జూచి
యెఱుక యెఱుకోయటం చెలుంగెత్తి పలుక
నిని పురస్త్రీలు దాని బల్వింతగాను.

6