పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

శ్రీరంగమాహాత్మ్యము

గీ. విలసమునినాభ కావేరి యిసుకదీవి, పువ్వుఁదోటలనడును నపూర్వమైన
      బలగరపుసెజ్జలోన శ్రీరంగధాముఁ, డిందిరయు దాను గ్రీడించు నెందు నెపుడు.
గీ. వాసుదేవుని పడకయిల్లయి సమస్త, బనులకును కామధేనువై సకలదురిత
      హారిణియు నైన నదిమీఁద నలిగి నీవు, కట్టుకొనుటేమి యన నాతఁ డిట్టులనియె.
క. నీ వేమి గట్టుకొనియెదు, దేవా పొడచూపరాదె తీరనిపనికిం
      కావేరికినగు నాకగు, చేవదలనటన్నమాట చెవిసోఁకుటయున్.
చ. అడుగుము నీకు నేవరమునైన నొసంగెదనన్న నెవ్వరం
      చడగను నిన్నుఁ జూడక బయల్విని నావుడు నీశ్వరుండ నే
      ర్పడ ననుఁ జూడ బ్రహ్మయు సుపర్వులు నోపరటన్న నీవు నా
      యొడయుఁడవేను నీయడియ నోపుదు సన్నిధిగమ్ము నావుఁడున్.
సీ. శ్రీవత్స మనుమచ్చ జెలఁగు నెమ్మేనితో కౌస్తుభమణిపతాకంబుతోడ
      మకరకుండలభాసమానకర్ణములతో డంబైన మణికిరీటంబుతోడ
      శంఖచక్రాదిరాజద్భుజాగ్రములతో దయలీను నేత్రపద్మములతోడ
      నొగపరివలువాటు పసిఁడిదువ్వలువతోఁ గమలగాపున్న వక్షంబుతోడ
      హారమంజీరకటకకేయూరకంక, ణాంగదంబులతో మందహాసవదన
      చంద్రబింబంబుతో గుణసాగరుండు, హరి సుబోధునియెదురఁ బ్రత్యక్షమయ్యె.
క. కలయో భ్రమనీతినొక్కో, నిలుకడయో యనుచు నలక నివ్వెఱగాంచెన్
      తలకించున్ పులకించున్, దిలకించున్ దెలివి గాంచు భృతి వాటించున్.
గీ. తోడఁబ్రణమిల్లి లేచి చేదోయి మొగిచి, వామదేవాయ సద్బ్రహ్మనాచకాయ
      శ్రీనివాసాయ! రంగవిమానశేష, శేషశయనాయతే నమస్తే నమోస్తు.
సీ. దేవ నీవదనంబు తేజోమయంబు చంద్రార్కులు నీలోచనాంబుజములు
      దిక్కులునాల్గు మీచక్కనిభుజములు మీకు నాభిస్థలం బాకసంబు
      పూనికగా కాష్ఠములు నీదువీనులు భూమీరుహమ్ములు రోమరాజి
      పర్వతద్వీపరూపచరాచరము మేను పంచభూతస్వరూపంబు నీవ
      మహదహంకారనామతన్మాత్ర వీవ, ప్రకృతిపురుషుండవును పరబ్రహ్మ వీవ
      సృష్టినటనంబులెల్ల నీచేతనయ్యె, కొలుతు రెప్పుడు మిమ్ముఁ బుణ్యులు రమేశ.
క. నినుఁ గొలుచునట్టి సజ్జను, లనయంబును చేరసార మగుసంసారం
      బననుమతులై తరింతురు, కనలే రీజాడ యెంతఘనులు ననంతా.
క. నీచక్కని ముఖచంద్రుని, జూచితి నీకరుకులైన చూపులచేతన్
      నీచుఁడ నానేరమునకు, నీచరణమెగాక దిక్కు నెమకినగలదే.