పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

శ్రీరంగమాహాత్మ్యము

      యోగు లేమేరనుండిన నుండగలరు, వలయుమేనులు దాల్తు నెవ్వరితరంబు
      కాదనఁగ నవ్విహంగంబు కననచింతు, నినుఁడనుచు భానుఁడనియె నమ్మునిగురించి.
మ. క్షితపాఖ్యుండగు మౌనిరా జెపుడు నక్లిష్టప్రచారుండు శి
      క్షితుఁడయ్యున్ దన కూరికే నిగమముల్ చేకూరఁగా గోరి శా
      శ్వతు రంగప్రభు నాత్మలోఁ దలఁచి ప్రాంచత్పుష్కరిణ్యాగ్ర మా
      నితపుణ్యాశ్రమభూమిఁ జేసె తప మెన్నేవర్షముల్ సుస్థితిన్.
గీ. తలకు లే కొకకొన్నివత్సరము లంబు, పర్ణపనసాశనతదూర్థ్వబాహుం డగుచు
      నటనిరాహారుఁడై కొన్నిహాయనంబు, లున్న క్లితపునిపైఁ గృపాయుక్తుఁ డగుచు.
సీ. జలధరశ్యామకోమలగాత్ర మిందిరాతరళకటాక్షవైఖరుల బ్రోవ
      దరహాసవదనచంద్రకళాకలాపంబు పాంచజన్యప్రభాపటలి బ్రోవ
      హారమాణిక్యకోటీరకుంతలరుచుల్ తనకరాంచలసుదర్శనము బ్రోవ
      కాంచనశాటికాచంచత్ప్రకాశంబు మేననున్న లతాంగి మిసిమి బ్రోవ
      నురము మృగనాభిశ్రీవత్సగరిమ బ్రోవ, చరణములు వైనతేయుహస్తములు బ్రోవ
      నధరము దయారసాలాపసుధను బ్రోవ, తాను మునిఁబ్రోవ శౌరి ప్రత్యక్షమయ్యె.
గీ. కాంచి యయ్యోగి రంగేశుమించి భక్తి, నెంచి బులకలు మేనవర్షించె నశ్రు
      లుంచి తత్పదములుమాడ్కి పెంచె ప్రమద, మెంచె తద్ధన్యత దృణీకరించె భవము.
క. దాసోహ మనుచు నంగ, న్యాసనమస్కరణుఁడై కృతాంజలికరుఁడై
      యాసంయమి శ్రీరంగని, వాసుని నుతియించె సజలవారిదధ్వనితోన్.
స్రగ్ధర. కనుఁగొంటిన్ రంగధాముం గలశజలధిరాటన్యకాపూర్ణకామున్
      వనదశ్యామాభిరామున్ వనజహితసతావార్యకళ్యాణధామున్
      బ్రణుతబ్రహ్మాదిధామున్ బహువిధదురితాపాదిదక్షోవిరామున్
      దినమాసద్యత్సహర్యేథితభువనమహాదేవతాసార్వభౌమున్.
సీ. శ్రీరంగధామ శ్రీమదాకారంబు వలయుఁ జూడఁగఁ జూట్కిగల ఫలంబు
      దీనమందార మీదివ్యాంఘ్రియుగ్మంబు పూజింపవలె గరాంభోజఫలము
      కావేరికానాథ మీవినూనమహాత్మ్యములు వినునటయె వీనుల ఫలంబు
      కమలానివాస మీకళ్యాణగుణములు ప్రకటింవపవలయు నాలుక ఫలంబు
      కమలజారాధ్య మీదుకైంకర్యములను, బూని మెలఁగంగవలయు నెమ్మేనిఫలము
      గాక యితరఫలాపేక్ష నాగదంత, వాదములు సాక్షి నేనవివాద మేల.
గీ. కెలన నిక్షేపరాసి తంగేటిజున్ను, ముంగిట సురద్రుమంబు ముంగొంగు పసిఁడి
      యింటిలో కామగవిఁ గనుఁగొంటి ననక, మనక నినుఁ గొల్వఁజనువాఁడు మనుజపశువు.