పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

శ్రీరంగమాహాత్మ్యము

నవమాశ్వాసము

      శ్రీసదనాయతనయన సు
      ధాసాగరమధ్యభోగితల్పశయన దే
      వాసురచారణసిద్ధ మ
      హాసంయమిగేయ వేంకటాచలరాయా.
వ. అవధరింపు మిట్లు నాగదంతమహామునికి వ్యాసు లానతిచ్చిన తెఱంగు సూతుండు
      శౌనకాదుల నుద్దేశించి.
సీ. పురి కేగి జయరథభూపాలకుఁడు మున్ను తనవర్తనముఁ జూచి కినిసి రోసి
      విడిచిపోయిన మహీవిబుధులఁ బ్రార్థించి శ్రీకరలీల బహూకరించి
      యగ్రహారము లిచ్చి యాశ్రితకోటిగా మనుపుచు ధర్మవర్తనముచేత
      దనపురోహితుఁడు బల్కినజాడ మెలఁగుచు దొలుతటిలెక్క పుత్రకులఁ గాంచి
      పౌత్రులను జెంది పాడియఁ బంట కలిగి, జనులు సుఖమున రామరాజ్యము ననంగ
      పుణ్యములప్రోకయై తలంపున దలంచి, రంగపతిఁ గొల్వవచ్చె శ్రీరంగమునకు,
గీ. వచ్చి తాఁజూచినటుల బిల్వంబుచేత, రంగనాయకపూజాపరాయణులను
      మానసధ్యాననిరతులు నైన యతుల, లోన విలసిల్లు వాల్మీకిమౌనిఁ గాంచి.
క. అతనికి సాష్టాంగముగా, నతియొనరిచి తన్నుఁ బ్రోచిన భరద్వాజున్
      మతిఁ బూజించి పురోహితు, ననుమతి ననుపె భూప తెసగం బెసఁగన్.
ఉ. ఉంగరముల్ దుకూలములు నొల్లెలు జీరలు మార్లు జాళువా
      పొంగళు లెచ్చు చౌకటులపోగులు కుండలముల్ మురుంగులున్